Mahaa Daily Exclusive

  తమ మూలాలను మరువని ‘చాయ్‌వాలా’.. అస్సాం తేయాకు తోటల్లో మోదీ భావోద్వేగం..

Share

  • అస్సాం తేయాకు తోటల్లో మోదీ భావోద్వేగం.
  •  రెండు శతాబ్దాల నిరీక్షణకు తెర.
  •  28 వేల టీ తోటల కుటుంబాలకు భూమి హక్కులు.
  •  ‘మీరు పండించిన టీ అమ్మే ఈ స్థాయికి చేరా’.. తోటల కార్మికులతో ప్రధాని హృద్యమైన అనుబంధం.

గువహటి, మహా.

ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి దేశ ప్రధానిగా ఎదిగినా.. తన ఎదుగుదలకు పునాదిగా నిలిచిన ‘టీ’ మరియు ఆ టీని పండించే ‘కార్మికుల’ పట్ల నరేంద్ర మోదీ చూపుతున్న కృతజ్ఞతా భావం నేటి రాజకీయాల్లో ఒక అరుదైన దృశ్యం. అస్సాం పర్యటనలో భాగంగా బుధవారం ఆయన తేయాకు తోటల కార్మికులతో గడిపిన క్షణాలు, వారి కష్టసుఖాలను పంచుకున్న తీరు ‘నిజమైన నాయకుడు ఎప్పుడూ తన మూలాలను మరువడు’ అనే మాటకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాయి. కేవలం మాటలకే పరిమితం కాకుండా, అస్సాం తేయాకు చరిత్రలో గత 200 ఏళ్లుగా జరగని ఒక అద్భుతానికి ఆయన శ్రీకారం చుట్టారు. తరతరాలుగా తోటల్లోనే మగ్గిపోతూ, కనీసం నివాసం ఉంటున్న భూమిపై హక్కులు లేని 28,241 టీ తోటల కుటుంబాలకు ‘భూమి పట్టాల’ను పంపిణీ చేసి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ ప్రసంగం అత్యంత భావోద్వేగంగా సాగింది. “నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మీరు పండించిన తేయాకే.. ఆ టీని అమ్ముకుని ఎదిగిన నేను, ఈ పట్టాల పంపిణీ ద్వారా నా రుణాన్ని తీర్చుకుంటున్నాను” అని ఆయన వ్యాఖ్యానించడం అక్కడి కార్మికుల హృదయాలను హత్తుకుంది. గత రెండు శతాబ్దాలుగా ఈ కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సామాజిక అన్యాయానికి ముగింపు పలకడమే తన లక్ష్యమని, రాబోయే రోజుల్లో మరో ఐదు లక్షల మంది కార్మికులకు ఈ భూమి హక్కులను కల్పిస్తామని హామీ ఇచ్చారు. ‘ఏతి కోలి దుతి పాత్’ (రెండు ఆకులు ఒక మొగ్గ) వంటి పథకాల ద్వారా వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే కాకుండా, తోటల ప్రాంతాల్లో అధునాతన పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నారు.

గత ఏడాది కాలంగా అస్సాంలోని హథీకులి వంటి ప్రముఖ టీ ఎస్టేట్లలో ప్రధాని చేసిన పర్యటనలు ఆ ప్రాంత రూపురేఖలనే మార్చేశాయి. కాజీరంగా జాతీయ పార్కు సమీపంలోని తోటల్లో ఆయన రాత్రిపూట బస చేయడం, అక్కడి క్షేత్రస్థాయి సిబ్బందితో ముచ్చటించడం ద్వారా ఆ ప్రాంత పర్యాటక రంగానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. ఫలితంగా టాటా గ్రూప్ వంటి దిగ్గజ సంస్థలు అక్కడ లగ్జరీ హోటళ్ల నిర్మాణానికి ముందుకు రావడం విశేషం. కేవలం అధికారాన్ని చెలాయించే పాలకుడిలా కాకుండా, ఆ తోటల్లో పనిచేసే కార్మికుల్లో ఒకడిగా కలిసిపోయి, వారి శ్రమకు విలువనిస్తూ, వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు మోదీ తీసుకుంటున్న ఈ చర్యలు ఒక గొప్ప నాయకత్వ లక్షణానికి నిదర్శనం. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు మాత్రమే కాదని, అణగారిన వర్గాల కళ్లలో ఆనందాన్ని చూడటమే అని ఆయన తన పర్యటనల ద్వారా నిరూపిస్తున్నారు

Latest