- గాలిలో దీపంలా ‘లక్ష కోట్ల’ ప్రాజెక్టు మనుగడ.
- వానాకాలం ముంచుకొస్తున్నా వీడని మేడిగడ్డ మిస్టరీ.
- ప్రశ్నార్థకంగా బ్యారేజీల పునరుద్ధరణ!
- పరీక్షల పేరుతో కాలయాపన.. నివేదికలకే పరిమితమైన ‘మరమ్మతులు’.
- అన్నదాతల ఆశలపై నీళ్లు!
హైదరాబాద్, మహా.
తెలంగాణ సాగునీటి రంగంలో ‘ఇంజినీరింగ్ అద్భుతం’గా వెలిగిపోతుందనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు ఒక తీరని వేదనగా మారుతోంది. లక్ష కోట్ల ప్రజాధనాన్ని అప్పనంగా ధారపోసి నిర్మించిన ఈ భారీ ప్రాజెక్టు.. సాంకేతిక వైఫల్యాలు, పాలకుల నిర్లక్ష్యం, అధికార యంత్రాంగం నత్తనడక ధోరణిలో చిక్కుకుని విలవిలలాడుతోంది. ముఖ్యంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులు అడుగు కూడా ముందుకు పడకపోవడంతో, రాబోయే వానాకాలం నాటికి ఈ ప్రాజెక్టు మనుగడ సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) జారీ చేసిన కఠిన నిబంధనలు, తప్పనిసరిగా నిర్వహించాల్సిన పరీక్షల విషయంలో తెలంగాణ ఇరిగేషన్ శాఖ మీనమేషాలు లెక్కిస్తుండటంతో కాలం కరిగిపోతోంది. ఒకవైపు మేఘాలు కదులుతున్నాయి, నదులు పొంగిపొర్లే సమయం దగ్గరపడుతోంది.. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం మరమ్మతులకు నోచుకోక బ్యారేజీలు శిథిలావస్థను తలపిస్తున్నాయి.
మేడిగడ్డ బ్యారేజీలో కుంగిపోయిన ‘ఏడో బ్లాక్’ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో అతిపెద్ద ఇంజినీరింగ్ మిస్టరీగా మారింది. గత అక్టోబరులో పిల్లర్లు కుంగిపోయిన నాటి నుండి నేటి వరకు ఆ బ్లాక్‌ను అసలు ఉంచాలా లేక పూర్తిగా కూల్చివేసి కొత్తది నిర్మించాలా అన్న సందిగ్ధతలో ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోంది. ఎన్డీఎస్ఏ సూచించిన అత్యంత కీలకమైన జియో టెక్నికల్, జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్స్ ఇంకా ప్రారంభమే కాలేదు. కాంక్రీట్ పటిష్ఠతను తెలుసుకునేందుకు వేయాల్సిన 30 బోర్‌హోల్స్ పనులు ఇంకా మొదలుకాలేదు. సీపేజీ విశ్లేషణ కోసం చేపట్టాల్సిన 16 బోర్‌హోల్స్, టోమోగ్రఫీ పరీక్షలకు అవసరమైన 458 బోర్‌హోల్స్‌లో కేవలం నాలుగు మాత్రమే పూర్తయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మేడిగడ్డ బ్యారేజీలో యూపీవీ-రీబౌండ్ హ్యామర్ పరీక్షలు కేవలం ఐదు బ్లాకుల్లో మాత్రమే ముగిశాయి, మరో 3 బ్లాకులకు ఇంకా జరగాల్సి ఉండటం గమనార్హం. యంత్రాలు వస్తున్నాయని, రిపోర్టులు తయారవుతున్నాయని అధికారులు చెబుతున్న మాటలు కోటలు దాటుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పనులు అంగుళం కూడా కదలడం లేదు.
అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితి మరింత గందరగోళంగా ఉంది. ఇక్కడ ప్రధానంగా సీపేజీ (నీటి ఊట) సమస్యలు ప్రాజెక్టు పునాదులనే కదిలిస్తున్నాయి. అన్నారం బ్యారేజీలో పేరుకుపోయిన భారీ ఇసుక మేటలు పరీక్షలకు గండంగా మారాయి. ఆ ఇసుకను తొలగిస్తే తప్ప బ్యారేజీ దిగువన రాఫ్ట్ పరిస్థితి ఏమిటో చెప్పలేమని పుణె శాస్త్రవేత్తలు తెగేసి చెబుతున్నా, ఇసుక తొలగింపు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇక్కడ మొత్తం 54 వెంట్లకు గాను 22 వెంట్లకు మాత్రమే పరీక్షలు పూర్తి కాగా, మిగిలిన 32 వెంట్లలో పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. బ్యారేజీ రాఫ్ట్ దిగువన పరిస్థితిని అంచనా వేసేందుకు 85 వెంట్లలో చేపట్టాల్సిన జియోఫిజికల్ స్టడీస్ జాడ కూడా లేదు. ప్రాజెక్టు డిజైన్ ప్రకారం వరద ప్రవాహాన్ని తట్టుకునే సామర్థ్యంపై నిర్వహించాల్సిన 2డీ హైడ్రాలిక్ మోడల్ స్టడీస్, త్రీడీ హైడ్రాలిక్ మోడల్ స్టడీస్ ఇప్పటివరకు ప్రారంభమే కాలేదు. బ్యారేజీ ఎగువన ఐదారు కిలోమీటర్లు, దిగువన మూడు నాలుగు కిలోమీటర్ల మేర నిర్వహించాల్సిన ఈ కీలక అధ్యయనాలు లేకపోతే రేపు వచ్చే వరదలకు ఈ బ్యారేజీలు తట్టుకుంటాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పరీక్షల పేరుతో జరుగుతున్న ఈ కాలయాపన వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. వర్షాకాలం ప్రారంభమై ప్రవాహం మొదలైతే బ్యారేజీల దిగువన పరీక్షలు నిర్వహించడం అసాధ్యం. అంటే ఇప్పుడున్న అల్ప సమయాన్ని వృథా చేస్తే, ఈ ఏడాది కూడా కాళేశ్వరం నుంచి చుక్క నీరు కూడా ఆయకట్టుకు అందే అవకాశం ఉండదు. లక్ష కోట్లు వెచ్చించినా చివరకు పంపుహౌస్‌లు మూతపడటం, బ్యారేజీలు ఎడారిని తలపించడం తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయం చేయడమే. ఎన్డీఎస్ఏ ఆదేశాల ప్రకారం నీటిని నిల్వ చేసే సాహసం చేయలేక, మరోవైపు మరమ్మతులు పూర్తి చేయలేక ప్రభుత్వం చేతులు ఎత్తేసినట్లు కనిపిస్తోంది. ఏప్రిల్ ఆఖరుకు కొన్ని, జూన్ ఆఖరుకు మరికొన్ని పరీక్షలు పూర్తి చేస్తామని ప్రాజెక్టు ఇంజినీర్లు ఇటీవల ఎన్డీఎస్ఏ ఛైర్మన్‌కు నివేదించినప్పటికీ, క్షేత్రస్థాయిలో యంత్రాల కొరత, సాంకేతిక లోపాలు ఈ ప్రక్రియను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో ఒక భారీ వైఫల్యంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.






