Mahaa Daily Exclusive

  బస్ భవన్‌లో ‘ఐటీ’, ‘జీఎస్టీ’ పాగా..!

Share

  •   నాలుగు అంతస్తుల తాళాలు పగులగొట్టి స్వాధీనం.
  •   సీఎస్ ఉత్తర్వులతోనే రంగంలోకి అధికారులు.
  •   ఉద్యోగుల విలీనం ముందే ఆస్తులపై కన్నేసిన సర్కారు.
  •   ప్రభుత్వ తీరుపై కార్మిక సంఘాల గర్జన.. నేడు అత్యవసర భేటీ.

హైదరాబాద్‌: మహా.

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రధాన కార్యాలయమైన ‘బస్ భవన్’లో బుధవారం హైడ్రామా చోటుచేసుకుంది. ఆర్టీసీ ఆస్తులపై ప్రభుత్వం పెత్తనం చలాయించే దిశగా అడుగులు వేయడం సంస్థలో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదాయపు పన్ను (ఐటీ), జీఎస్టీ అధికారులు బస్ భవన్‌లోని ‘ఏ-బ్లాక్’లో ఉన్న నాలుగు అంతస్తులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆయా అంతస్తుల్లో ఉన్న ఆర్టీసీ కార్యాలయాల తాళాలను అధికారులు పగులగొట్టి, వాటికి తమ సొంత తాళాలు వేసి సీల్ చేయడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఈ నాలుగు అంతస్తులను కేటాయించిందని, ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జీవో జారీ చేశారని అధికారులు వెల్లడించారు.

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ఇంకా కొలిక్కి రాకముందే, సంస్థకు చెందిన కీలక ఆస్తులను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవడంపై కార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. కార్పొరేషన్ పరిధిలో ఉన్న బస్ భవన్‌పై ప్రభుత్వానికి అజమాయిషీ ఎలా ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులను రోడ్డున పడేసే కుట్రలో భాగంగానే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని నేతలు ఆరోపిస్తున్నారు. సంస్థ ఆస్తులు, సిబ్బంది అంతా ఇంకా కార్పొరేషన్ కిందనే ఉన్నప్పుడు, ఏకపక్షంగా ఆ కార్యాలయాలను ఇతర ప్రభుత్వ విభాగాలకు ఎలా కేటాయిస్తారని నిలదీస్తున్నారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు అత్యవసరంగా సమావేశం కానున్నాయి. విలీన ప్రక్రియ పూర్తి చేయకుండా ఆస్తులను ఉపయోగించుకోవడాన్ని అడ్డుకుంటామని, అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. బస్ భవన్ ఆక్రమణ వెనుక ఉన్న లోగుట్టును బట్టబయలు చేస్తామని, తమ ఆస్తులను రక్షించుకోవడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధమని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ తాజా చర్యతో ఆర్టీసీలో మరోసారి ఉద్యోగ, కార్మిక పోరు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Latest