హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో కొత్త పింఛన్ల కోసం ఏళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న పేదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త అందించింది. సంక్షేమ పథకాల అమలులో భాగంగా ‘చేయూత’ పింఛన్ల పరిధిని పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా మరో రెండు లక్షల మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసేందుకు పరిపాలనాపరమైన కసరత్తును ముమ్మరం చేసింది. ఇందుకు అవసరమైన నిధులను 2026-27 వార్షిక బడ్జెట్లో కేటాయించడంతో క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు మార్గం సుగమమైంది. దాదాపు మూడేళ్లుగా కొత్త పింఛన్ల మంజూరు నిలిచిపోవడంతో నిరాశలో ఉన్న అర్హులకు ప్రభుత్వ తాజా నిర్ణయం కొండంత అండగా మారనుంది.
బడ్జెట్ కేటాయింపులతో కదిలిన యంత్రాంగం
కొత్త పింఛన్ల మంజూరు కోసం ప్రభుత్వం ఈ బడ్జెట్లో రూ.233 కోట్లను ప్రత్యేకంగా కేటాయించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 42.23 లక్షల మంది వివిధ కేటగిరీల కింద చేయూత పింఛన్లు పొందుతున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులతో పాటు హెచ్ఐవీ, బోదకాలు బాధితులకు నెలకు రూ.2,016 చొప్పున అందుతుండగా, దివ్యాంగులకు మాత్రం రూ.4,016 చెల్లిస్తున్నారు. ఇప్పుడు అదనంగా చేరబోయే రెండు లక్షల మందితో ఈ లబ్ధిదారుల సంఖ్య మరింత పెరగనుంది. గత కొన్నేళ్లుగా కేవలం డయాలసిస్, బోదకాలు బాధితులకు తప్ప ఇతర విభాగాల్లో కొత్త వారికి అవకాశం లభించలేదు. దీంతో ప్రభుత్వంపై పెరిగిన ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని ఈ విడతలో భారీగా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు.
అర్హుల ఎంపిక.. అధికారులకు కత్తిమీద సామే
ప్రభుత్వం రెండు లక్షల పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉన్న దరఖాస్తుల సంఖ్య చూస్తుంటే అధికారులకు ఇది పెను సవాల్‌గా మారేలా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ వద్ద సుమారు 12 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో వృద్ధాప్య పింఛన్ల కోసం 4 లక్షలు, వితంతువుల కోటాలో 3.5 లక్షలు, గీత, చేనేత కార్మికుల నుంచి 3 లక్షలు, దివ్యాంగుల విభాగంలో 72 వేల దరఖాస్తులు ఉన్నాయి. తాజాగా జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమాలు, గ్రామసభల ద్వారా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పోటెత్తుతున్న దరఖాస్తుల నుంచి కేవలం రెండు లక్షల మంది అత్యంత అర్హులను గుర్తించడం అధికారులకు క్లిష్టతరంగా మారింది.
పారదర్శకతకు పెద్దపీట.. వడపోత షురూ
భారీ సంఖ్యలో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, రాజకీయ ప్రమేయం లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు పటిష్టమైన కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సామాజిక తనిఖీలు నిర్వహించి, అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామసభల్లో వచ్చే విజ్ఞప్తులను ఎప్పటికప్పుడు క్రోడీకరిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూడటమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోంది. ఏదేమైనా, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాది మంది పేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందనడంలో సందేహం లేదు.








