Mahaa Daily Exclusive

  స్విమ్మింగ్ పూల్‌లో ముగ్గురి మృతి..

Share

  • తల్లి, ఇద్దరు కుమార్తెల విషాదాంతం.

ఐనవోలు, మహా.

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో బుధవారం రాత్రి గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు చిన్నారులు స్విమ్మింగ్ పూల్‌లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. గ్రామానికి చెందిన అజారుద్దీన్ తన భార్య ఫర్హత్ (26), కుమార్తెలు ఉమేరా (8), ఆయేషా (6)తో కలిసి తాను నిర్వహిస్తున్న స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లగా, కాసేపటికే వారంతా విగతజీవులుగా పూల్‌లో తేలారు. ఒకేసారి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సమాచారం అందుకున్న ఐనవోలు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

మృతురాలు ఫర్హత్ ప్రస్తుతం మూడోసారి గర్భం దాల్చిందని, ఈ విషయంపైనే భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. దంపతుల మధ్య తలెత్తిన మనస్పర్థలే ఈ ఘోరానికి దారి తీసి ఉంటాయని మృతురాలి పుట్టింటి వారు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తె, మనవరాళ్ల మృతి సహజ మరణం కాదని, దీని వెనుక అజారుద్దీన్ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫర్హత్ తండ్రి అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే ఇది ఆత్మహత్యనా లేక మరేదైనా కారణమా అనే విషయంపై స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం కుటుంబ కలహాలే ప్రధాన కారణమని అనుమానిస్తున్నప్పటికీ, అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. నిండు గర్భిణితో పాటు ఇద్దరు పసిపిల్లలు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం పున్నేలు గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు నింపింది.

Latest