- చరిత్రలో తొలిసారిగా రూ.44 వేల కోట్లు దాటిన ఆదాయం.
హైదరాబాద్, మహా .
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదాయం ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.44,000 కోట్ల మైలురాయిని అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించింది. ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో అన్ని మార్గాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు మొత్తం రూ.44,557 కోట్ల భారీ ఆదాయం సమకూరినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఒకే ఏడాదిలో ఇంతటి భారీ మొత్తంలో రాబడి రావడం ఇదే ప్రథమం కావడంతో ఎక్సైజ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విక్రయాల పెరుగుదలతో పాటు లైసెన్స్ ఫీజులు, దరఖాస్తుల రూపంలో వచ్చిన ఆదాయం ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించింది.
**మద్యం విక్రయాల జోరు.. ఖజానాకు కళ**
గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఊహించని రీతిలో సాగాయి. మొత్తం రూ.40,209 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరగగా, దీని ద్వారా కేవలం ఎక్సైజ్ సుంకం రూపంలోనే ప్రభుత్వానికి రూ.39,368 కోట్ల రాబడి లభించింది. వీటికి అదనంగా రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాల లైసెన్స్ ఫీజుల ద్వారా రూ.1,771 కోట్లు, 1,214 బార్ల ద్వారా రూ.549 కోట్ల ఆదాయం చేకూరింది. ఇక కొత్తగా దుకాణాల కేటాయింపు ప్రక్రియలో భాగంగా నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రభుత్వానికి భారీగా కలిసివచ్చింది. నాన్-రిఫండబుల్ ఫీజు కింద ఏకంగా రూ.2,869 కోట్లు రావడం విశేషం. వెరసి అన్ని మార్గాల ద్వారా వచ్చిన ఆదాయంతో ఎక్సైజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక వనరుగా నిలిచింది.
**ఏడేళ్లలో రెట్టింపైన రాబడి.. మారుతున్న ప్రాధాన్యతలు**
గత ఏడేళ్ల కాలాన్ని విశ్లేషిస్తే ఎక్సైజ్ ఆదాయం రెట్టింపు కావడం గమనార్హం. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.20,859 కోట్లుగా ఉన్న రాబడి, ఇప్పుడు రూ.44 వేల కోట్ల మార్కును దాటడం విశేషం. అయితే మద్యం వినియోగంలో వినియోగదారుల ప్రాధాన్యతలు మారుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పరిమాణం పరంగా ఐఎంఎల్ (లిక్కర్) విక్రయాలు గణనీయంగా పెరిగినప్పటికీ, బీర్ల అమ్మకాలు మాత్రం ఆశించిన స్థాయిలో సాగలేదు. గత ఏడాదితో పోలిస్తే బీర్ల విక్రయాలు 9 శాతం తగ్గి 387.34 లక్షల కేసులకు పరిమితమయ్యాయి. విక్రయాల తగ్గుదల ఉన్నప్పటికీ, ధరల సర్దుబాటు , ఇతర రుసుముల వల్ల మొత్తం ఆదాయంలో మాత్రం వృద్ధి నమోదైంది.
**ఎన్నికలు, వేడుకల ఎఫెక్ట్.. డిసెంబరులో రికార్డు విక్రయాలు**
గత ఏడాది డిసెంబరు నెల ఎక్సైజ్ శాఖకు అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. అటు పంచాయతీ ఎన్నికల కోలాహలం, ఇటు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు తోడవడంతో మందుబాబులు రికార్డు స్థాయిలో మద్యం సేవించారు. కేవలం డిసెంబరు నెలలోనే రూ.5,051 కోట్ల విలువైన అమ్మకాలు జరగడం విశేషం. సాధారణ నెలలతో పోలిస్తే ఎన్నికల సమయంలో విక్రయాలు జోరుగా సాగడం శాఖకు కలిసొచ్చింది. మొత్తానికి ఈ ఏడాది ఎక్సైజ్ శాఖ సాధించిన ఈ అసాధారణ వృద్ధి రాష్ట్ర వార్షిక ఆదాయ అంచనాలను మించిపోవడం గమనార్హం. రాబోయే రోజుల్లో ఆదాయాన్ని మరింత పెంచే దిశగా శాఖ మరిన్ని సంస్కరణలు చేపట్టే అవకాశం ఉంది.








