హైదరాబాద్, మహా.
దేశాభివృద్ధి కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోనే సాధ్యమని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారి శాంతికుమార్ పేర్కొన్నారు. వనపర్తి జిల్లా ఖిలా ఘనపురం మండలం షాపూరం, అప్పిరెడ్డిపల్లె, కర్నెతండా గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, యువత గురువారం హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భారీగా భాజపాలో చేరారు. వారికి శాంతికుమార్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రం ఇప్పటికే రూ.6 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని తెలిసి కూడా, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాధ్యం కాని ఆరు గ్యారంటీలను ఇచ్చి ప్రజలను ఆ పార్టీ వంచించిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా బూటకపు మాటలతో కాలక్షేపం చేస్తోందని మండిపడ్డారు.
ప్రజలను మోసం చేయడమే నైజంగా పెట్టుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అసలు స్వరూపాన్ని గమనించే క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా భాజపా వైపు మొగ్గు చూపుతున్నారని శాంతికుమార్ వివరించారు. కరోనా కష్టకాలంలో దేశవ్యాప్తంగా ఉచిత రేషన్ అందించి కోట్లాది కుటుంబాలను ఆదుకున్న ఘనత ప్రధాని మోదీదేనని కొనియాడారు. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల ముడి చమురు కొరత ఏర్పడే ముప్పు ఉన్నప్పటికీ, సామాన్యులపై పెట్రో భారం పడకుండా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి కేంద్రం తన చిత్తశుద్ధిని చాటుకుందని గుర్తుచేశారు. ఈరోజు జరుగుతున్న ఈ చేరికలు చిన్న నీటి బిందువుల్లా కనిపించినా, భవిష్యత్తులో ఇవి మహా సముద్రంలా మారి తెలంగాణలో భాజపా విజయానికి నాంది పలుకుతాయని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ సమాజంలోని యువత వికసిత భారత్ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని, మలినమైన రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకు సిద్ధాంత బలం ఉన్న భాజపాలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో భాజపాను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్, వనపర్తి జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ, ప్రధాన కార్యదర్శులు పెద్దిరాజు, శ్రీనివాస్, ఖిలా ఘనపురం మండల అధ్యక్షుడు బుచ్చిబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుడ్డన్న, పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.








