హైదరాబాద్, మహా.
దేశాభివృద్ధికి పల్లెలే పట్టుకొమ్మలన్న నినాదంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని గ్రామ పంచాయతీల బలోపేతానికి భారీగా నిధులను విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత కింద రూ.619.85 కోట్లను కేంద్రం కేటాయించింది. ఈ నిధుల విడుదలపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం అనుసరిస్తున్న ‘సబ్కా సాథ్.. సబ్కా వికాస్’ మంత్రం ప్రతి గ్రామంలోనూ స్పష్టంగా కనిపిస్తోందని, ఈ నిధులు పల్లెల రూపురేఖలను మార్చనున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
**అభివృద్ధి పనులకు అండగా ‘టైడ్’, ‘అన్ టైడ్’ నిధులు**
తాజాగా విడుదలైన రూ.619.85 కోట్ల నిధులను కేంద్రం రెండు విభాగాలుగా కేటాయించింది. ఇందులో రూ.371.91 కోట్లు ‘టైడ్ గ్రాంట్’ కింద కేటాయించగా, ఈ నిధులను పారిశుధ్యం, తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, వర్షపు నీటి సంరక్షణ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించాల్సి ఉంటుంది. మిగిలిన రూ.247.94 కోట్లను ‘అన్ టైడ్ గ్రాంట్’గా మంజూరు చేసింది. ఈ నిధులను గ్రామాల్లోని స్థానిక అవసరాలకు అనుగుణంగా గ్రామ సభల్లో చర్చించి, ప్రాధాన్యత కలిగిన అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేసుకునే వెసులుబాటు కల్పించింది. కేంద్రం నుంచి నిధులు అందిన పది పని దినాల్లోపు రాష్ట్ర ప్రభుత్వం వీటిని సంబంధిత గ్రామ పంచాయతీలకు బదిలీ చేయాలని, ఆలస్యమైతే వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
**ఎనిమిదేళ్లలో పెరిగిన కేటాయింపులు.. పక్కదారి పడితే సహించం**
గతంతో పోలిస్తే మోదీ ప్రభుత్వ హయాంలో తెలంగాణ గ్రామాలకు అందుతున్న నిధుల శాతం భారీగా పెరిగిందని కిషన్ రెడ్డి గణాంకాలతో వివరించారు. 14వ ఆర్థిక సంఘం కాలంలో రూ.5,060 కోట్లు కేటాయించగా, 15వ ఆర్థిక సంఘం వచ్చేసరికి ఆ మొత్తం 80 శాతం పెరిగి రూ.9,050 కోట్లకు చేరుకుందని పేర్కొన్నారు. వెరసి 14, 15వ ఆర్థిక సంఘాల కాలంలో మొత్తం రూ.14,110 కోట్లు రాష్ట్రానికి కేటాయించగా, ఇప్పటికే అత్యధిక భాగం నిధులను కేంద్రం విడుదల చేసింది. అంతేకాకుండా, రాబోయే 16వ ఆర్థిక సంఘం (2026-31) ద్వారా తెలంగాణలోని పంచాయతీలు సుమారు రూ.9,968 కోట్ల గ్రాంటును పొందే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.
**ఎన్నికల నిర్వహణలో జాప్యంపై విమర్శలు**
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించకుండా రెండేళ్ల పాటు స్పెషల్ ఆఫీసర్ల పాలనతో గడిపినందువల్ల నిధుల విడుదలలో కొంత జాప్యం జరిగిందని కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు గ్రామాలకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించాయని ఆయన ఆరోపించారు. అయినప్పటికీ, గ్రామాల్లో అభివృద్ధి ఆగకూడదనే ఉద్దేశంతో కేంద్రం ఎప్పటికప్పుడు సానుకూలంగా స్పందిస్తోందని తెలిపారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పిస్తే, నిధుల విడుదలకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర నిధులకు సమానంగా మ్యాచింగ్ గ్రాంట్లను విడుదల చేసి పల్లె ప్రగతికి సహకరించాలని ఆయన కోరారు.








