- నిబంధనలకు పాతర.. ‘భూ భారతి’కి మస్కా.
- నాలా భూమికి పట్టా పాసుపుస్తకాల జారీ.
- కోట్ల విలువైన స్థలంపై అక్రమార్కుల కన్ను.
- ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఆగని రిజిస్ట్రేషన్లు.
సూర్యాపేట, మహా.
అది నగర శివారులో కోట్లు పలికే విలువైన భూమి. దశాబ్ద కాలం క్రితమే ఆ భూమి రూపురేఖలు మారిపోయాయి. వ్యవసాయ భూమి కాస్తా నాలా అనుమతులు పొంది, ప్లాట్లుగా మారి, రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయ్యాయి. అక్కడ ఇప్పుడు పచ్చని చేలు లేవు.. కేవలం కాంక్రీటు వెంచర్లు మాత్రమే ఉన్నాయి. కానీ, రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ఆ భూమి ఇప్పటికీ ‘వ్యవసాయ భూమి’గానే దర్శనమిస్తోంది. అంతటితో ఆగకుండా, ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ‘భూ భారతి’ పోర్టల్‌ను అడ్డం పెట్టుకుని, అక్రమార్కులు దొడ్డిదారిన ఆ భూమికి కొత్తగా పట్టా పాసుపుస్తకాలు కూడా పొందేయడం సూర్యాపేట జిల్లాలో పెను సంచలనంగా మారింది. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి వాస్తవాలను తుంగలో తొక్కి, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి చేసిన ఈ వ్యవహారంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అక్రమ పర్వం వెనుక తుంగతుర్తికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి బావమరిది హస్తం ఉన్నట్లు ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సూర్యాపేట మండల పరిధిలోని సర్వే నంబరు 71/3లో ఉన్న 2.34 ఎకరాల భూమి చుట్టూ ఈ వివాదం ముదిరింది. గతంలో కోదాటి ఆండాళమ్మ పేరుపై ఉన్న ఈ భూమి కాలక్రమేణా కొండపల్లి వెంకటరెడ్డి, బొలిశెట్టి శ్రీరాములు, కొరివి వీరన్న, ధారవత్ భిక్షం అనే నలుగురి చేతుల్లోకి మారింది. వారు 2009లోనే ప్రభుత్వానికి నాలా కన్వర్షన్ ఫీజు చెల్లించి, ఆ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకున్నారు. అనంతరం లేఅవుట్ వేసి ప్లాట్లుగా విక్రయించారు. ప్రస్తుతం అక్కడ వ్యవసాయం మచ్చుకైనా కనిపించదు. అయితే, ఈ భూమిపై కన్నేసిన కొందరు అక్రమార్కులు, ఒకప్పటి యజమాని ఆండాళమ్మ మనవడు శ్యాంసుందర్ పేరుతో 2024లో వారసత్వ బదిలీ (సక్సెషన్) కింద హక్కులు మార్పించుకున్నారు. క్షేత్రస్థాయిలో భూమి స్వభావం మారిపోయిందని తెలిసినా, రెవెన్యూ అధికారులు కళ్లు మూసుకుని మరీ పట్టా పుస్తకాలు జారీ చేయడం గమనార్హం.
ఈ వ్యవహారంపై బాధితులు గత ఏడాది అక్టోబరు 13నే జిల్లా కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వోలకు స్పష్టమైన ఆధారాలతో ఫిర్యాదు చేశారు. 2025లో ఫిర్యాదు అందినప్పటికీ, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, ఈ ఏడాది జనవరిలో మరో అడుగు ముందుకేసి భూ భారతి పోర్టల్ ద్వారా ఒక ఎకరా భూమిని వేరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేసేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలను, బాధితుల మొరను పట్టించుకోకుండా కింది స్థాయి సిబ్బంది చక్రం తిప్పడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. బుధవారం ఈ మొత్తం వ్యవహారంపై హైదరాబాద్‌లోని భూ పరిపాలన ప్రధాన కార్యాలయంలో (CCLA) బాధితులు ఫిర్యాదు చేశారు. సాంకేతిక లోపాలను, విచారణ నిబంధనల్లోని సడలింపులను ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయల విలువైన భూములను దారి మళ్లిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భూ రికార్డుల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ‘భూ భారతి’ వ్యవస్థ అక్రమార్కుల పాలిట వరంగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. డిజిటల్ రికార్డులను క్షేత్రస్థాయి వాస్తవాలతో సరిపోల్చకుండా మార్పులు చేయడం వల్ల అసలైన యజమానులు రోడ్డున పడుతున్నారు. సూర్యాపేటలో జరిగిన ఈ ఘటన కేవలం మచ్చుతునక మాత్రమేనని, క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా హక్కుల మార్పిడికి అనుమతి ఇస్తే ఇలాంటి అక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా పెచ్చుమీరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుని, అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తేనే సామాన్య ప్రజలకు వ్యవస్థపై నమ్మకం కలుగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ‘భూ’ భాగోతంపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.








