- దేశంలోనే తొలిసారిగా మూడు ప్రత్యేక ఏఐ టూల్స్.. యువతే లక్ష్యంగా పోలీసుల అస్త్రాలు
- పిల్లల ప్రవర్తనను పసిగట్టే ‘మిత్ర’..
హైదరాబాద్, మహా.
మాదకద్రవ్యాల రవాణాదారుల వేట, నెట్వర్క్ ధ్వంసం చేయడం వంటి రొటీన్ దర్యాప్తులకు భిన్నంగా తెలంగాణ ఎలైట్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈగల్ ఫోర్స్) సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. యువత మత్తు బారిన పడకుండా ప్రాథమిక దశలోనే నిరోధించడం, సాంకేతిక పరిజ్ఞానంతో ముఠాల ఆట కట్టించడంపై ఈ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేసే మూడు ప్రత్యేకమైన టూల్స్‌ను ఈగల్ ఫోర్స్ అందుబాటులోకి తెచ్చింది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లోనూ సేవలందించే ఈ టూల్స్‌ను డీజీపీ శివధర్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. ఈగల్ ఫోర్స్ వెబ్సైట్ ద్వారా ఈ సేవలు సామాన్య ప్రజలకు సైతం అందుబాటులోకి వచ్చాయి.
మత్తు పదార్థాలకు సంబంధించిన ఎటువంటి సందేహాలనైనా నివృత్తి చేసేందుకు ‘సహాయ్ ఏఐ’ అనే చాట్‌బాట్‌ను రూపొందించారు. మాదకద్రవ్యాలు సేవించే వారిని ఎలా గుర్తించాలనే అంశంపై ఇది సెకన్ల వ్యవధిలో సమాధానం ఇస్తుంది. తరచుగా మూడ్ స్వింగ్స్ కావడం, పెదాలు పొడిబారడం, కళ్లు ఎర్రబడటం, అసాధారణ వాసనలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వారిపై నిఘా ఉంచాలని ఈ టూల్ సూచిస్తుంది. ఇక ఇప్పటికే వ్యసనానికి గురైన వారు ఆ ఊబి నుంచి బయటపడేందుకు ‘షీల్డ్ ఏఐ’ అండగా నిలుస్తుంది. మత్తు వల్ల కలిగే అనర్థాలను వివరించడమే కాకుండా, బాధితుల వివరాలను వంద శాతం గోప్యంగా ఉంచుతూ వారికి అవసరమైన సలహాలు అందిస్తుంది.
టీనేజర్లను మత్తు మహమ్మారి నుంచి రక్షించడమే ధ్యేయంగా ‘మిత్ర-టీజీ’ అనే టూల్‌ను ఈగల్ ఫోర్స్ సిద్ధం చేసింది. ముఖ్యంగా 13 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు గల వారిలో తలెత్తే మానసిక, ఆరోగ్య మార్పులను అర్థం చేసుకునేలా దీనిని తీర్చిదిద్దారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లల ప్రవర్తనను విశ్లేషించేందుకు వీలుగా ఇందులో ప్రత్యేక ప్రశ్నావళిని పొందుపరిచారు. తల్లిదండ్రుల కోసం 39 అంశాలు, ఉపాధ్యాయుల కోసం 7 అంశాలతో కూడిన ఈ ప్రశ్నావళి ద్వారా పిల్లలు ప్రమాదంలో ఉన్నారో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. ఒక్కో అంశానికి కేటాయించిన పాయింట్లు కలిపి మొత్తం 16 దాటితే ఆ టీనేజర్ కచ్చితంగా ప్రమాద అంచుల్లో ఉన్నట్లు భావించి అప్రమత్తం కావాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
పిల్లల్లో పెరుగుతున్న మానసిక ఆందోళన, ఒంటరిగా ఉండేందుకు ప్రాధాన్యమివ్వడం, భోజనం మానేయడం, మాటల్లో తడబాటు వంటి లక్షణాలను తల్లిదండ్రులు ఈ ప్రశ్నావళి ద్వారా నిశితంగా పరిశీలించవచ్చు. ఒకవేళ పిల్లాడు మత్తుకు అలవాటు పడ్డాడని గుర్తిస్తే, వెంటనే వైద్య నిపుణుల ద్వారా చికిత్స అందించాలని ఈగల్ ఫోర్స్ సూచిస్తోంది. మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ విభాగం, ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేసి కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తూ దూసుకుపోతోంది. ఈ ఏఐ టూల్స్ రాకతో డ్రగ్స్ రహిత తెలంగాణ దిశగా అడుగులు మరింత వేగవంతం కానున్నాయి.








