Mahaa Daily Exclusive

  రాజ్యసభలో అమరావతి బిల్లుకు గ్రీన్ సిగ్నల్..

Share

  •  కాళేశ్వరంపై కిషన్ రెడ్డి, సురేష్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం.
  • చట్టబద్ధత బిల్లుకు ఎగువ సభ ఆమోదముద్ర.
  •  రాష్ట్రపతి సంతకానికి మార్గం సుగమం.
  •  విభజన హామీలపై గళమెత్తిన తెలంగాణ ఎంపీలు.
  •  ఏపీ పునర్నిర్మాణ బిల్లుగా మార్చొద్దని హితవు.

ఢిల్లీ, మహా.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అత్యున్నత చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. గురువారం రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఎగువ సభ ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లు, రాజ్యసభలోనూ మూజువాణి ఓటుతో నెగ్గడంతో ఇక రాష్ట్రపతి సంతకం కోసం పంపనున్నారు. ఈ చారిత్రాత్మక బిల్లుపై చర్చ సందర్భంగా సభలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ప్రధానంగా తెలంగాణ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కాళేశ్వరంపై అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య మాటల యుద్ధం జరగడంతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. అమరావతి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూనే, విభజన హామీల అమలుపై ఎంపీలు తమ గళాన్ని గట్టిగా వినిపించారు.

రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తావన రావడం తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. కేంద్రమంత్రి సి.ఆర్. పాటిల్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జోక్యం చేసుకుని ఘాటుగా స్పందించారు. మేడిగడ్డ ప్రాజెక్టు పనికిరాకుండా పోయిందని నిపుణుల కమిటీ తేల్చిచెప్పిందని, కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కుటుంబం ఒక ఏటీఎంలా వాడుకుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇంజినీర్ల సలహాలు కూడా తీసుకోకుండా ఈ ప్రాజెక్టును చేపట్టడం వల్లే నేడు ఈ దుస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. ఆనాడు ఏడు మండలాల విలీనానికి కేసీఆర్ అంగీకరిస్తూ సోనియా గాంధీ ఇంటికి వెళ్లిన విషయాన్ని కూడా కిషన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. దీనికి ప్రతిగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ.. విభజన సమయంలో తెలంగాణ అనుమతి లేకుండానే కొన్ని మండలాలను ఏపీలో కలిపారని, 12 ఏళ్లుగా కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందకపోయినా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని స్పష్టం చేశారు. ఏపీ విభజన బిల్లును ఏపీ పునర్నిర్మాణ బిల్లుగా మార్చవద్దని ఆయన హితవు పలికారు.

మరోవైపు, అమరావతి రాజధానిగా ఉండటమే పాలనాపరంగా అన్ని వర్గాలకు సౌలభ్యంగా ఉంటుందని వైసీపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ వల్ల హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందిందో మనమంతా చూశామని, అమరావతిని కూడా అదే స్థాయిలో ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే సత్తా ఆయనకు ఉందని కితాబిచ్చారు. ప్రధాని మోదీకి కూడా అమరావతిని అభివృద్ధి చేయాలనే తపన ఉందని, ఈ బిల్లుకు అందరూ సహకరించాలని కోరారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ ప్రజలు కవల పిల్లల వంటివారని, ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకంపై ఇంకా అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని, నిర్దేశిత కాలపరిమితితో పారదర్శక విధానంలో వీటిని అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. భౌగోళికంగా కొన్ని గ్రామాలు ఏ రాష్ట్రానికి చెందని పరిస్థితి ఏర్పడిందని, వీటిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తానికి అమరావతి బిల్లు ఆమోదం పొందిన వేళ, విభజన హామీల సెగలు మరోసారి పార్లమెంట్ సాక్షిగా బహిర్గతమయ్యాయి.

Latest