Mahaa Daily Exclusive

  రాజ్యసభలో అమరావతి బిల్లు కలకలం.. వైకాపా సభ్యుల వాకౌట్..

Share

  •  రాజధాని పేరిట కూటమి సర్కార్ డ్రామాలు.
  •  లక్షల కోట్ల నిధుల సమీకరణ సాధ్యమేనా?: వైవీ సుబ్బారెడ్డి.
  •  విభజన హామీలు నెరవేర్చాల్సిందే.
  •  మూడు రాజధానుల వల్ల ఏపీకి తీరని నష్టం: రేణుకా చౌదరి.

 

ఢిల్లీ , మహా.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో హైడ్రామా చోటుచేసుకుంది. అమరావతి అభివృద్ధిని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. మధ్యాహ్నం ప్రారంభమైన సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టగా, దీనిపై సుదీర్ఘ చర్చ జరిగింది. అధికార తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలతో పాటు కాంగ్రెస్, శివసేన, ఆమ్ ఆద్మీ పార్టీ, జేడీయూ వంటి విపక్షాలు కూడా బిల్లుకు మద్దతు తెలపడం విశేషం. అయితే, రాజధాని నిర్మాణ వ్యయం, భూసేకరణ తీరును తప్పుబడుతూ వైకాపా సభ్యులు సభలో నిరసన వ్యక్తం చేశారు.

చర్చలో పాల్గొన్న వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం అమరావతి పేరిట ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, ఇదంతా ఒక పెద్ద డ్రామా అని ఆరోపించారు. రాజధాని అభివృద్ధి కోసం గతంలోనే రైతుల నుంచి 50 వేల ఎకరాల భూమిని సేకరించారని, దాని కోసమే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని భావిస్తున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు తాజాగా మరో 50 వేల ఎకరాల సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని, ఇందుకు అదనంగా మరో లక్ష కోట్లు అవసరమవుతాయని వివరించారు. ఇంత భారీ ఎత్తున అంటే దాదాపు రూ.2 లక్షల కోట్ల నిధులను సమీకరించడం సాధ్యమయ్యే పనేనా అని ఆయన సభలో అనుమానం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ బిల్లును ముందుకు తెస్తున్నారని విమర్శిస్తూ, నిరసనగా తమ పార్టీ సభ్యులతో కలిసి సభ నుంచి బయటకు వెళ్లారు.

మరోవైపు, కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మాట్లాడుతూ విభజన చట్టంలోని అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర విభజన జరిగి ఇన్నేళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇంకా పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని మండిపడ్డారు. హామీల అమలులో జరుగుతున్న జాప్యానికి గానూ ఏపీకి ప్రత్యేక పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. 12 ఏళ్లు గడిచినా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకం పూర్తి కాకపోవడం పట్ల ఆమె అసహనం వ్యక్తం చేశారు. గత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ‘మూడు రాజధానుల’ పేరుతో కాలయాపన చేసి, చివరకు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని విమర్శించారు. విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, అన్ని హామీలను నిర్ణీత గడువులోగా నెరవేర్చాలని ఆమె కోరారు.

అమరావతి బిల్లుకు వివిధ రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభించడం విశేషం. టీడీపి, బీజేపీ సభ్యులు రాజధాని నిర్మాణ ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని, అది ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అని వారు అభివర్ణించారు. శివసేన, ఆప్, జేడీయూ సభ్యులు కూడా రాజధాని నిర్మాణానికి కేంద్రం పూర్తిస్థాయిలో నిధులు సమకూర్చాలని సూచించారు. వైకాపా వాకౌట్ చేసినప్పటికీ, మెజారిటీ పార్టీల మద్దతుతో చర్చ కొనసాగింది. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, రైతులకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో ఈ బిల్లు కీలక పాత్ర పోషిస్తుందని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి అమరావతి బిల్లుపై జరిగిన ఈ చర్చ అటు అభివృద్ధి ఆకాంక్షలకు, ఇటు రాజకీయ వైరుధ్యాలకు వేదికగా నిలిచింది.

Latest