Mahaa Daily Exclusive

  వరంగల్‌లో తమిళనాడు గొలుసు దొంగల ముఠా గుట్టురట్టు..

Share

  •  తండ్రీకొడుకులదే నేర చరిత్ర.. రూ.25 లక్షల విలువైన సొత్తు స్వాధీనం.
  •  జల్సాల కోసం దొంగతనాలు.. ఆరు కేసుల్లో నిందితుల అరెస్ట్.

వరంగల్, మహా.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒంటరి మహిళలే లక్ష్యంగా వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడుతూ బెంబేలెత్తిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆట కట్టించారు పోలీసులు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇద్దరు కిలాడీ దొంగలను వరంగల్ సీసీఎస్, హనుమకొండ పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సుమారు రూ.15.20 లక్షల విలువైన 95 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ గురువారం మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో నిందితులు ఈ అకృత్యాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది.

ఈ ముఠా నేర శైలి పోలీసులనే విస్మయానికి గురిచేస్తోంది. నిందితులిద్దరూ తమిళనాడు నుంచి రైళ్లలో బయలుదేరి వరంగల్, కాగజ్‌నగర్ వంటి నగరాలకు చేరుకునేవారు. అక్కడ స్థానికంగా ద్విచక్ర వాహనాలను దొంగిలించి, వాటిపై తిరుగుతూ ఒంటరిగా వెళ్లే మహిళల మెడలోని పుస్తెల తాళ్లు, గొలుసులను లాక్కొని పరారయ్యేవారు. స్నాచింగ్ చేసిన వెంటనే తిరిగి రైలు ఎక్కి తమిళనాడుకు చెక్కేసేవారు. తాజాగా నగరంలో ఒక బైక్ దొంగతనం చేసి, గొలుసు చోరీలకు పాల్పడి పారిపోతుండగా పోలీసులకు అందిన పక్కా సమాచారంతో వారిని పట్టుకున్నారు. నిందితులపై ఇప్పటివరకు వరంగల్‌లో ఐదు, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో ఒక కేసు నమోదైనట్లు సీపీ వివరించారు. నిందితుల వయస్సు సుమారు 30 ఏళ్లు ఉంటుందని, వీరిని లోతుగా విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.

ఈ దొంగల ముఠా వెనుక పెద్ద నేర చరిత్రే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన నిందితుల్లో ఒకరి తండ్రికి తమిళనాడులో పాత నేర చరిత్ర ఉంది. ఆయనపై అక్కడ సుమారు తొమ్మిది కేసులు నమోదై ఉన్నాయి. కేవలం గొలుసు దొంగతనాలే కాకుండా, ఇళ్లలో చొరబడి దోపిడీలు చేయడం, దొరికిన సామాన్లను ఎత్తుకెళ్లడం ఆయన వృత్తిగా ఉండేది. తండ్రి బాటలోనే నడుస్తూ కుమారుడు కూడా గొలుసు దొంగతనాలకు అలవాటు పడటం గమనార్హం. ఇదే క్రమంలో మరో ఘటనలో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న మరో ఇద్దరు దొంగలను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన 35 గ్రాముల బంగారం, రూ.2 లక్షల నగదుతో పాటు టీవీలు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

నేరాలను అదుపు చేసేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామని, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పౌరుల నుంచి అందిన సమాచారం ఆధారంగానే ఈ ముఠాలను పట్టుకోగలిగామని సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. రెండు వేర్వేరు కేసుల్లో పట్టుబడిన ఈ దొంగల నుంచి మొత్తం రూ.25 లక్షల పైచిలుకు విలువైన సొత్తును రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. చైన్ స్నాచింగ్ ముఠాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. వరుస దొంగతనాలతో వణికిపోతున్న వరంగల్ వాసులకు ఈ అరెస్టులతో కొంత ఉపశమనం లభించినట్లయింది.

Latest