- ఆధారాలు లేకుండా అడ్డుకోలేం.. గాంధీ సరోవర్‌పై పిటిషన్ కొట్టివేత.
- అనుమతుల తర్వాతే ముందడుగు.. ట్రిబ్యునల్‌కు స్పష్టం చేసిన ప్రభుత్వం.
హైదరాబాద్, మహా.
మూసీ నది పునరుజ్జీవం, సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో కీలక విజయం లభించింది. గాంధీ సరోవర్ నిర్మాణం పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా సాగుతోందంటూ బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను చెన్నైలోని ఎన్జీటీ ధర్మాసనం కొట్టివేసింది. కేవలం అనుమానాలతో ప్రాజెక్టులను అడ్డుకోవడం సాధ్యం కాదని, పిటిషనర్ తన వాదనలకు సంబంధించి ఎటువంటి సాంకేతిక లేదా శాస్త్రీయ ఆధారాలను సమర్పించలేదని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఈ తీర్పుతో మూసీ పరివాహక ప్రాంతంలో తలపెట్టిన సుందరీకరణ పనులకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయినట్లయింది.
**నివేదికల తర్వాతే అనుమతులు**
విచారణ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక ఇంకా రూపకల్పన దశలోనే ఉందని ఎన్జీటీకి వివరించారు. గాంధీ సరోవర్ నిర్మాణానికి సంబంధించి తుది నిర్ణయం తీసుకున్న తర్వాత, చట్టబద్ధంగా అవసరమైన అన్ని పర్యావరణ అనుమతులు పొందిన పిమ్మటే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. పర్యావరణానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన విశ్లేషణలు చేస్తామని ప్రభుత్వం పేర్కొనడంతో, ఈ దశలో పిటిషన్‌ను విచారించలేమని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
**వేగవంతం కానున్న సుందరీకరణ పనులు**
ఎన్జీటీ తీర్పుతో మూసీ సుందరీకరణ పనుల్లో వేగం పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే మంచిరేవుల వద్ద ఓంకారేశ్వరాలయానికి భూమిపూజ నిర్వహించిన సర్కారు, నదిలోకి మురుగునీరు కలవకుండా అత్యాధునిక ఎస్టీపీల నిర్మాణంపై దృష్టి సారించింది. నది పరివాహక ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్, చెక్ డ్యామ్‌ల ఏర్పాటు వంటి పనుల కోసం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మూసీ నదికి పునర్జీవం పోయడమే కాకుండా, నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ట్రిబ్యునల్ నుంచి సానుకూల నిర్ణయం రావడంతో ఇకపై ప్రాజెక్టు పనులు పట్టాలెక్కనున్నాయి.
**బాధితులకు పునరావాసంపై సీఎం భరోసా**
మరోవైపు మూసీ ప్రాజెక్టు వల్ల ప్రభావితమయ్యే ఎవరికీ అన్యాయం జరగనివ్వబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. మూసీ నది అభివృద్ధి క్రమంలో ఎవరినీ నిరాశ్రయులను చేయమని, బాధితులందరికీ మెరుగైన పునరావాసం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. వారికి నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలతో కూడిన ప్రత్యామ్నాయ నివాసాలను ఏర్పాటు చేస్తామని శాసనమండలి సాక్షిగా ప్రకటించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలను నమ్మవద్దని, బాధితుల పట్ల ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరిస్తుందని ఆయన పేర్కొన్నారు. తగిన న్యాయం చేసిన తర్వాతే ప్రాజెక్టు పనుల్లో ముందుకెళ్తామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.








