Mahaa Daily Exclusive

  ఆడపిల్లలూ ఆలకించండి..! ఆస్తితో పాటు బాధ్యతలు పంచుకోవాలన్న హైకోర్టు న్యాయమూర్తి..

Share

  • ఆడపిల్లలూ ఆలకించండి
  • ఆస్తిలో హక్కే కాదు
  • తల్లిదండ్రుల సంరక్షణలోనూ కుమార్తెలకు సమాన బాధ్యత
  • ఆస్తితో పాటు బాధ్యతలు పంచుకోవాలన్న హైకోర్టు న్యాయమూర్తి
  • పిటిషనర్ ఆరోపణలపై వివరణ కోరుతూ సూర్యాపేట జిల్లా అధికారులకు కోర్టు నోటీసులు

 

హైదరాబాద్, మహా : తల్లిదండ్రుల ఆస్తిలో సమాన హక్కులు కోరుకుంటున్న కుమార్తెలు.. వృద్ధాప్యంలో వారిని సంరక్షించే బాధ్యతను కూడా సమానంగా తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆస్తి హక్కులతో పాటు బాధ్యతలను కూడా విస్మరించకూడదని స్పష్టం చేసింది. సూర్యాపేట జిల్లాకు చెందిన 66 ఏళ్ల వృద్ధురాలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం.. నేటి సమాజంలో వృద్ధ తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న దీన స్థితిపై ఆవేదన వ్యక్తం చేసింది.

 

కేసు వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లాకు చెందిన సదరు పిటిషనర్ తన కుమారుడు తనను పట్టించుకోవడం లేదని తన ఆస్తిని తిరిగి ఇచ్చేలా అధికారులు ఇచ్చిన ఆదేశాలను లెక్క చేయటం లేదని కోర్టును ఆశ్రయించింది. ‘తల్లిదండ్రుల సంరక్షణ వయోవృద్ధుల సంక్షేమ చట్టం’ కింద ఇంటి పత్రాలను, భూమిని తిరిగి ఇవ్వాలని 2025 డిసెంబర్‌లో పిటిషనర్‌ కుమారుకి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ ఉత్తర్వులను కుమారుడు బేఖాతరు చేయటమే కాకుండా తనను మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆమె వాపోయింది. ప్రస్తుతం తాను కుమార్తె వద్ద ఉంటున్నానని పిటిషన్‌లో పేర్కొంది.

 

ఈ విచారణ సందర్భంగా జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి సమాజంలోని పోకడలను ఎత్తిచూపారు. ప్రస్తుతం కోర్టుల్లో వృద్ధ తల్లిదండ్రులు తమ కుమారులు, కోడళ్లను ఆస్తుల నుంచి గెంటివేయాలని కోరుతూ దాఖలు చేసే పిటిషన్లు వెల్లువలా వస్తున్నాయని చెప్పారు. ప్రతిరోజూ కనీసం రెండు వరకు ఇలాంటి పిటిషన్లు విచారణకు వస్తున్నాయన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే రాజీ మార్గాలు వెతకాలన్నారు. ఆస్తి నుంచి వెలివేయడం అనేది చివరి ప్రయత్నంగా ఉండాలని.. కానీ బాధితులు మొదటి దశలోనే ఆ విజ్ఞప్తి చేస్తున్నారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

 

ముఖ్యంగా కుమార్తెల బాధ్యత గురించి ప్రస్తావిస్తూ.. కేవలం కుమారులు లేని వారే కాదు, కుమార్తెలు ఉన్నవారు కూడా వృద్ధాప్యంలో ఇబ్బందులు పడుతున్నారని కోర్టు అభిప్రాయపడింది. చాలా సందర్భాల్లో కుమార్తెలు తల్లిదండ్రుల ఆస్తిపై హక్కులు కోరుకుంటున్నారు కానీ, వారిని సంరక్షించే విషయంలో వెనకాడుతున్నారన్నారు. కేవలం కుమార్తెలు మాత్రమే ఉన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటని కోర్టు ప్రశ్నించింది. కుమార్తెలు కచ్చితంగా బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. ఆస్తిలో వాటా అడిగే ప్రతి కుమార్తె, తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాల్సిన నైతిక, చట్టపరమైన బాధ్యతను కలిగి ఉంటుందని గుర్తు చేశారు.

 

విచారణ సందర్భంగా కోదాడ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో పోలీసు, పరిపాలనా యంత్రాంగం విఫలమైందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అధికారులు పట్టించుకోకపోవటం పిటిషనర్ హక్కులను ఉల్లంఘించడమేనని న్యాయమూర్తి కోర్టుకు విన్నవించింది. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. పిటిషనర్ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని సూర్యాపేట జిల్లా అధికారులను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేశారు.

Latest