Mahaa Daily Exclusive

  భక్తులకు ఐఆర్‌సీటీసీ ‘జ్యోతిర్లింగ’ కానుక.. ఒకే ప్రయాణంలో ఏడు క్షేత్రాల దర్శనం..

Share

హైదరాబాద్, మహా.

వేసవి సెలవుల్లో పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని భావించే భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. ‘భారత్ గౌరవ్’ టూరిస్ట్ రైలు ద్వారా అత్యంత పవిత్రమైన ఏడు జ్యోతిర్లింగ క్షేత్రాలను సందర్శించేలా ప్రత్యేక యాత్రకు శ్రీకారం చుట్టింది. 11 రాత్రులు, 12 రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ ఆధ్యాత్మిక ప్రయాణం భక్తులకు మరుపురాని అనుభూతిని అందించనుంది. ఏప్రిల్ 27న ప్రారంభం కానున్న ఈ యాత్ర మే 8వ తేదీతో ముగుస్తుంది. గోరఖ్‌పూర్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక రైలు, దేశంలోని పలు ప్రధాన జ్యోతిర్లింగ క్షేత్రాలను కవర్ చేస్తూ సాగుతుంది. తక్కువ ఖర్చుతో పడమర , మధ్య భారతంలోని శివలింగ క్షేత్రాలను దర్శించుకోవాలనుకునే వారికి ఇది ఒక సువర్ణావకాశమని ఐఆర్‌సీటీసీ పేర్కొంది.

 

**ఆధ్యాత్మిక పథం.. దర్శనీయ క్షేత్రాలివే**

 

ఈ యాత్రలో భాగంగా భక్తులు ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగంతో పాటు ఓంకారేశ్వర క్షేత్రాన్ని దర్శించుకుంటారు. అనంతరం గుజరాత్‌లోని ద్వారకాధీశ్, భేట్ ద్వారకలతో పాటు నాగేశ్వర్, సోమనాథ్ జ్యోతిర్లింగాలను సందర్శించేలా ప్రణాళిక రూపొందించారు. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర, భీమాశంకర, ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగాల దర్శనం కూడా ఈ ప్యాకేజీలో అంతర్భాగంగా ఉంది. జ్యోతిర్లింగాలతో పాటు నాసిక్‌లోని పంచవటి, కాలారామ్ ఆలయం వంటి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలను కూడా భక్తులు సందర్శించవచ్చు. ఒకే యాత్రలో ఇన్ని పవిత్ర స్థలాలను చూడటం భక్తులకు ఎంతో ఉపశమనాన్ని, ఆధ్యాత్మిక తృప్తిని ఇస్తుంది.

 

**సదుపాయాలు.. ప్యాకేజీ ధరల వివరాలు**

 

ప్రయాణికుల సౌకర్యార్థం ఈ భారత్ గౌరవ్ రైలులో మొత్తం 751 బెర్త్‌లను అందుబాటులో ఉంచారు. భక్తుల ఆర్థిక స్తోమతకు అనుగుణంగా సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ , స్లీపర్ క్లాస్ విభాగాల్లో ప్రయాణ వసతిని కల్పిస్తున్నారు. ధరల విషయానికి వస్తే.. ఎకానమీ విభాగంలో పెద్దలకు రూ.23,500, పిల్లలకు రూ.22,160 గా నిర్ణయించారు. స్టాండర్డ్ విభాగంలో పెద్దలకు రూ.40,000, పిల్లలకు రూ.38,430 ధర ఉంటుంది. ఇక అత్యంత విలాసవంతమైన కంఫర్ట్ విభాగంలో పెద్దలకు రూ.53,260, పిల్లలకు రూ.51,370 చార్జీ వసూలు చేస్తారు. ఈ ప్యాకేజీ ధరలోనే రైలు ప్రయాణం, బస చేయడానికి హోటల్ వసతి, అల్పాహారం, మధ్యాహ్న మరియు రాత్రి భోజనాలతో పాటు స్థానిక దర్శనాల కోసం బస్సు సౌకర్యం కూడా ఉండటం విశేషం.

 

**బుకింగ్ ప్రక్రియ.. ఈఎంఐ వెసులుబాటు**

 

ఈ పవిత్ర యాత్రలో పాల్గొనాలనుకునే భక్తులు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.com ద్వారా తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఒకేసారి మొత్తం సొమ్ము చెల్లించలేని వారి కోసం ఈఎంఐ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. రైలులోనే కేటరింగ్ సదుపాయం, భద్రతా సిబ్బంది వంటి అదనపు సౌకర్యాలు కూడా ఉండటం వల్ల వృద్ధులు, కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించే వారికి ఇది ఎంతో సురక్షితమైన మార్గంగా నిలుస్తుంది. వేసవి తాపాన్ని తట్టుకుంటూ ఆధ్యాత్మిక ప్రయాణంలో మునిగితేలాలనుకునే భక్తులు తక్షణమే తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఐఆర్‌సీటీసీ సూచించింది. దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా కేంద్రం ప్రవేశపెట్టిన ఈ భారత్ గౌరవ్ రైలు, సామాన్య భక్తులకు దైవ దర్శనాన్ని మరింత చేరువ చేస్తోంది.

Latest