• యూనిఫాం ఆర్డర్ల రద్దుతో వేలాది మందికి ఉపాధి దూరం.
• టెస్కోను నిర్వీర్యం చేసే కుట్ర.. వెనక్కి తగ్గకుంటే ఉద్యమం తప్పదు!
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలోని చేనేత రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తోందని, కార్మికుల పొట్టకొట్టేలా నిర్ణయాలు తీసుకుంటోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం హైదరాబాద్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఇచ్చే యూనిఫాంల ఆర్డర్‌ను రేవంత్ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేయడంపై నిప్పులు చెరిగారు. తమకు కావాల్సిన ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు లాభం చేకూర్చేందుకే వేలాది మంది చేనేత కార్మికుల నోటికాడ కూడును ఈ ప్రభుత్వం లాగేసుకుంటోందని ఆమె మండిపడ్డారు. గతంలో ఏటా సుమారు రూ.105 కోట్ల విలువైన యూనిఫాంల తయారీ ఆర్డర్లు చేనేతలకు దక్కేవని, ఇప్పుడు ఆ భరోసా లేకుండా పోవడంతో కార్మికులు వీధిన పడే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
చేనేత సహకార సంఘాల మనోభావాలను దెబ్బతీస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 393 సంఘాలపై తీవ్ర ప్రభావం పడుతుందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం యూనిఫాంలే కాకుండా, వివిధ సంక్షేమ శాఖలకు అవసరమైన దుప్పట్లు, దుస్తులకు సంబంధించిన సుమారు రూ.200 కోట్ల విలువైన ఆర్డర్లను కూడా స్థానిక చేనేతలకు ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ చేనేత బ్రాండ్ అయిన టెస్కో సంస్థకు ఆర్డర్లు ఇవ్వకుండా, దానిని క్రమంగా నిర్వీర్యం చేసే కుట్ర రేవంత్ సర్కార్‌లో సాగుతోందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల కంటే ప్రైవేటు వ్యక్తుల లాభాలకే ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని విమర్శించారు.
చేనేత కార్మికులు ఇప్పటికే పెరిగిన ముడి సరుకుల ధరలతో సతమతమవుతుంటే, ప్రభుత్వం ఉన్న ఉపాధిని కూడా దూరం చేయడం వారిని ఆత్మహత్యల దిశగా ప్రేరేపించడమేనని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో చేనేతలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని, పైగా అమల్లో ఉన్న పథకాలను కూడా రద్దు చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రద్దు చేసిన యూనిఫాం ఆర్డర్లను తిరిగి పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న సంక్షేమ శాఖల ఆర్డర్లను వెంటనే టెస్కో ద్వారా కార్మికులకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.








