Mahaa Daily Exclusive

  పోలవరం నిర్మాణంలో మరో చారిత్రక ఘట్టం..

Share

  •  డయాఫ్రం వాల్ పూర్తి.
  •  2027 పుష్కరాల నాటికి జాతికి అంకితం.
  • ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా.
  •  గత పాలకుల పాపానికి రూ.1000 కోట్ల అదనపు భారం.
  •  ఇరిగేషన్ శాఖకు సీఎం అభినందనలు.

 

అమరావతి, మహా.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గురువారం మరో కీలక మైలురాయి నమోదైంది. ప్రాజెక్టు మనుగడకు అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని రికార్డు స్థాయిలో ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ చారిత్రక ఘట్టంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఆనందాన్ని పంచుకున్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ప్రభుత్వ దృఢ సంకల్పంలో ఇదొక అద్భుతమైన మలుపు అని ఆయన అభివర్ణించారు. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత క్లిష్టమైన 1,372 మీటర్ల పొడవైన ఈ డయాఫ్రం వాల్‌ను అతి తక్కువ సమయంలోనే పూర్తి చేసిన ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇంజనీర్లను ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన కేంద్ర సంస్థలు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రతినిధులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా గత ప్రభుత్వ వైఖరిపై ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత పాలకుల నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యం వల్ల పాత డయాఫ్రం వాల్ తీవ్రంగా దెబ్బతిందని, దానివల్ల రాష్ట్ర ఖజానాపై రూ.1,000 కోట్ల అదనపు భారం పడిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల కాలంలో ప్రాజెక్టును గాలికొదిలేయడం వల్ల ఏర్పడిన అడ్డంకులను అధిగమించి, నేడు అదనపు నిధులు వెచ్చించి మరీ ఈ నిర్మాణాన్ని పూర్తి చేశామని వివరించారు. ఈ డయాఫ్రం వాల్ పూర్తి కావడంతో ప్రాజెక్టు ప్రధాన కట్టడమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులకు మార్గం సుగమమైందని, ఇకపై పనులు మరింత వేగవంతంగా సాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకాలు లేకుండా పనులను పరుగులు పెట్టించి ఆంధ్రుల కలల ప్రాజెక్టును సాకారం చేస్తామని భరోసా ఇచ్చారు.

రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పోలవరం ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఇప్పటికే ప్రకటించిన విధంగా అన్ని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, 2027 గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని చారిత్రక హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు కేవలం ఆనకట్ట మాత్రమే కాదని, అది కోట్లాది మంది రైతుల ఆశ అని, రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా అని ఆయన పేర్కొన్నారు. అహర్నిశలు శ్రమిస్తున్న కార్మికులు, సాంకేతిక నిపుణుల కృషి వృథా పోదని, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా వెలుగొందడంలో పోలవరం కీలక పాత్ర పోషిస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విజయం ఆంధ్రులందరి విజయమని ఆయన తన సందేశంలో కొనియాడారు.

Latest