* రేవంత్‌కు విజయన్ ‘కేరళ’ కౌంటర్.
* మీ ఇల్లు సక్కగ లేదు.. మాకు సలహాలిస్తారా?
* బుల్డోజర్ పాలన ఆపి.. అభివృద్ధిపై దృష్టి పెట్టండి: తెలంగాణ సీఎంకు పినరయి చురకలు!
* జీతాలివ్వలేని ప్రభుత్వం.. మాకు పాఠాలు చెబుతుందా? రేవంత్ రెడ్డిపై కేరళ సీఎం నిప్పులు!
* కేరళ ప్రగతిని విమర్శించే స్థాయి మీకు లేదు: రేవంత్‌పై పినరయి విజయన్ ఆగ్రహం!
హైదరాబాద్, మహా.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ సెగలు పుట్టిస్తున్నాయి. రేవంత్ రెడ్డి విమర్శలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తనదైన శైలిలో అత్యంత ఘాటుగా స్పందించారు. కేరళ ఎప్పుడో అభివృద్ధి చెందిందని, వేల మైళ్ల దూరంలో ఉన్న తమ రాష్ట్రం మీద విమర్శలు చేసే ముందు రేవంత్ రెడ్డి తన సొంత రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిపై దృష్టి పెడితే బాగుంటుందని విజయన్ హితవు పలికారు. తెలంగాణలో పేదల ఇళ్లను బుల్డోజర్లతో కనికరం లేకుండా కూల్చివేస్తూ, ఇక్కడకు వచ్చి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఆయన మండిపడ్డారు. కేరళలో కేవలం 0.55 శాతం మాత్రమే పేదరికం ఉందని, ఇది దేశంలోనే అత్యల్పమని గుర్తు చేస్తూ.. పేదరిక నిర్మూలనలో కేరళను చూసి తెలంగాణ నేర్చుకోవాల్సింది చాలా ఉందని పినరయి చురకలు అంటించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రచారాల కోసం ఖర్చు చేస్తున్న తీరుపై విజయన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేరళ వంటి రాష్ట్రాల్లో రాజకీయ ప్రకటనల కోసం కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృధా చేసే బదులు, ఆ నిధులను తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, పేదల సంక్షేమానికి ఖర్చు చేయాలని ఆయన సూచించారు. “సొంత రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు సకాలంలో ఇవ్వలేని ప్రభుత్వం.. కేరళకు వచ్చి మాకు పాలన గురించి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు” అంటూ రేవంత్ రెడ్డి సర్కార్ ఆర్థిక వైఫల్యాలను ఆయన ఎండగట్టారు. తెలంగాణలో పాలన అస్తవ్యస్తంగా ఉందనడానికి ఇదే నిదర్శనమని, ఇక్కడ ప్రగల్భాలు పలికే ముందు అక్కడ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకోవాలని పినరయి విజయన్ సూటిగా విమర్శించారు.
తెలంగాణ అధికారులే కేరళ వైపు చూస్తున్నారన్న సత్యాన్ని విజయన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2025లో తెలంగాణకు చెందిన ఉన్నతాధికారులు కేరళకు వచ్చి, ఇక్కడి అత్యాధునిక డిజిటల్ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ గురించి అధ్యయనం చేశారని, అద్భుతమైన ఆ వ్యవస్థను తమ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని భావించారని ఆయన వెల్లడించారు. తమ దగ్గర నేర్చుకోవడానికి అధికారులు వస్తుంటే, ముఖ్యమంత్రి మాత్రం అబద్ధాలతో విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. సంక్షేమం అంటే ఏమిటో, మంచి పాలన ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే రేవంత్ రెడ్డి రాజకీయ పర్యటనలు పక్కన పెట్టి కేరళలో క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆయన ఆహ్వానించారు. అబద్ధపు ప్రచారాలతో కేరళ ప్రజలను మభ్యపెట్టలేరని, ఇక్కడి ప్రజలు రాజకీయంగా ఎంతో చైతన్యవంతులని విజయన్ స్పష్టం చేశారు. కేరళ విద్యా, వైద్య రంగాల్లో సాధించిన ప్రగతిని విమర్శించే ముందు రేవంత్ రెడ్డి వాస్తవాలను తెలుసుకోవాలని పినరయి విజయన్ ఘాటైన హెచ్చరిక జారీ చేశారు.








