Mahaa Daily Exclusive

  మావోయిస్టు అగ్రనేత ప్రశాంత్ బోస్ కన్నుమూత: జైలు కస్టడీలో అనారోగ్యంతో మృతి!

Share

  • మావోయిస్టు అగ్రనేత ప్రశాంత్ బోస్ మృతి
  • జైలు కస్టడీలో అనారోగ్యం
  • రాంచీ ఆసుపత్రిలో విడిచిన తుదిశ్వాస

రాంచి, మహా : మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రశాంత్ బోస్ (కిషన్ దా) అనారోగ్యంతో మృతి చెందారు. 75 ఏళ్ల వయసులో జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జైలు కస్టడీలో ఉండగా శుక్రవారం తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో రాంచీ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు జైలు వర్గాల ద్వారా తెలిసింది. ప్రశాంత్ బోస్ గత 45 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. పీడిత, తాడిత వర్గాల విముక్తి, శ్రామిక వర్గ రాజ్య స్థాపన లక్ష్యంగా తన జీవితాన్ని అంకితం చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆయన నక్సల్బరీ ఉద్యమ ప్రభావంతో విప్లవ మార్గాన్ని ఎంచుకున్నారు. సిద్ధాంతకర్తగా, వ్యూహకర్తగా పార్టీ లో గుర్తింపు పొందారు.

నవంబర్ 12, 2021న జార్ఖండ్‌లోని సెరైకెలా – ఖర్సావాన్ జిల్లాలో తన భార్య షీలా మరాండీతో కలిసి పోలీసులకు చిక్కారు. అప్పటి నుంచి జైలులోనే ఉన్నారు.
2004 సెప్టెంబర్ 21న పీపుల్స్ వార్, ఎంసిసి వంటి విప్లవ వర్గాలను ఏకం చేసి మావోయిస్టు పార్టీ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. పార్టీ బలోపేతం, ఎర్రసైన్యం నిర్మాణంలో ఆయన కృషి విశేషమని సహచరులు పేర్కొంటున్నారు. అయితే జైలులో తగిన వైద్యం అందకపోవడంతోనే ఆయన మృతి చెందారని రాజకీయ ఖైదీలు ఆరోపిస్తున్నారు. అధికార వర్గాల అణచివేతపై ఆయన రాసిన వ్యాసాలు, రూపొందించిన వ్యూహాలు విప్లవవాదులకు మార్గదర్శకంగా నిలిచాయి. వృద్ధాప్యం, అనారోగ్యం వెంటాడుతున్నా జైలు గోడల మధ్య ఉన్నప్పటికీ ఆయనలోని విప్లవ నిబద్ధత చివరి వరకు కొనసాగిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Latest