Mahaa Daily Exclusive

  హైదరాబాద్ ‘గోల్డ్ మ్యాన్’కు ఐటీ ఉచ్చు: కొత్త చట్టం కింద దేశంలోనే తొలి వారెంట్.. కోటి విలువైన బంగారం సీజ్!

Share

* ఐటీ శాఖ గురితప్పలేదు..
* హైదరాబాద్‌ ‘గోల్డ్‌ మ్యాన్‌’కు బిగుస్తున్న ఉచ్చు!
* కొత్త ఐటీ చట్టం కింద దేశంలోనే తొలి వారెంట్‌..
* దర్గా చిన్న పహిల్వాన్‌ ఇంట్లో కోటి విలువైన బంగారం సీజ్‌!
* యూట్యూబ్‌ వీడియోలే కొంపముంచాయి.. ‘తెలంగాణ గోల్డ్‌ మ్యాన్‌’ అక్రమాస్తులపై అధికారుల పంజా!
* 900 గ్రాముల బంగారం.. 4 లక్షల ఆదాయం.. పొంతన లేని లెక్కలతో ఐటీ విచారణలో దొరికిపోయిన పహిల్వాన్!
* రియల్‌ ఎస్టేట్‌ సెటిల్‌మెంట్లే ఆదాయ వనరులా? గచ్చిబౌలి ‘గోల్డ్‌ మ్యాన్‌’ చిక్కుముడి విప్పుతున్న అధికారులు!
* నయా ఐటీ చట్టం పంజా.. హైదరాబాద్‌ ‘గోల్డ్‌ మ్యాన్‌’ గుట్టురట్టు!
హైదరాబాద్, మహా.
భాగ్యనగరంలో ‘బంగారు మనుషుల’పై ఆదాయపు పన్ను శాఖ తన నిఘా నేత్రాన్ని మరింత పదును పెట్టింది. గచ్చిబౌలి ప్రాంతంలో ‘తెలంగాణ గోల్డ్‌ మ్యాన్‌’గా సుపరిచితుడైన యాదగిరి చిన్న గౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్ ఇప్పుడు ఐటీ అధికారుల ఉచ్చులో చిక్కారు. సామాజిక మాధ్యమాల్లో భారీ బంగారు ఆభరణాలతో హంగామా చేస్తూ వార్తల్లో నిలిచే పహిల్వాన్ నివాసంపై దాడులు చేసిన అధికారులు.. సుమారు కోటి రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయన వద్ద లభించిన మొత్తం 900 గ్రాముల బంగారంలో, 700 గ్రాములకు సంబంధించి ఎటువంటి లెక్కలు లేకపోవడంతో వాటిని సీజ్ చేశారు. మిగిలిన 200 గ్రాములను వ్యక్తిగత అవసరాల నిమిత్తం మినహాయించి ఆయనకే వదిలేశారు. ఆభరణాల కొనుగోలుకు సంబంధించి ఆదాయ వనరులను వివరించడంలో ఆయన విఫలం కావడంతో అధికారులు ఈ కఠిన చర్య తీసుకున్నారు.
ఈ కేసు దేశవ్యాప్తంగా ఒక మైలురాయిగా నిలిచింది. ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిన నూతన ఆదాయపు పన్ను చట్టం-2025 కింద జారీ అయిన మొట్టమొదటి వారెంట్‌ ఇదే కావడం గమనార్హం. 1961 నాటి పాత చట్టంలోని సెక్షన్ 132 స్థానంలో వచ్చిన కొత్త చట్టం సెక్షన్ 247 ప్రకారం ఈ తనిఖీలు నిర్వహించారు. పహిల్వాన్ చేస్తున్న హంగామాను అధికారులు గత కొంతకాలంగా ‘సోషల్ ప్రొఫైలింగ్’ ద్వారా గమనిస్తున్నారు. యూట్యూబ్‌లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు, తన విలాసవంతమైన ఆస్తులను చూపిస్తూ చేసిన ‘హోమ్ టూర్’ వీడియోలే ఇప్పుడు ఆయన కొంపముంచాయి. గతంలో కొండా విజయ్ కుమార్ వంటి వారిపై కూడా ఇలాంటి దాడులే జరగగా, సూర్య భాయ్ అనే వ్యక్తి ధరించిన నగలు రోల్డ్ గోల్డ్ అని తేలింది. అయితే పహిల్వాన్ ధరించినవి మాత్రం మేలిమి బంగారు ఆభరణాలేనని ఐటీ అధికారులు నిర్ధారించారు.
విచారణలో భాగంగా పహిల్వాన్ తన ఆదాయానికి సంబంధించి ఇస్తున్న వివరణలు అధికారులను విస్తుగొలుపుతున్నాయి. ఏటా కేవలం రూ. 4 లక్షల ఆదాయం మాత్రమే ఉన్నట్లు ఐటీ రిటర్న్స్‌లో చూపించిన ఆయన.. కోటి రూపాయల విలువైన బంగారం ఎలా వచ్చిందన్న ప్రశ్నకు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ లావాదేవీలు, జీపీఏ సెటిల్‌మెంట్లు, అద్దెల ద్వారా వచ్చే నగదుతోనే ఈ నగలు చేయించుకున్నట్లు ఆయన వాదిస్తున్నారు. భూముల లావాదేవీల్లో నగదు రూపంలో తీసుకున్న కమీషన్లే తన ఆదాయమని ఆయన పేర్కొన్నప్పటికీ, ఆ లావాదేవీలకు ఎటువంటి రికార్డులు లేకపోవడాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. గచ్చిబౌలి పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, రాజకీయ నాయకుడిగా చలామణి అవుతున్న చిన్న పహిల్వాన్ అక్రమాస్తుల గుట్టు విప్పేందుకు అధికారులు ఆయన కుటుంబ సభ్యుల ఆర్థిక లావాదేవీలను కూడా జల్లెడ పడుతున్నారు. ఈ ఉదంతం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది.

Latest