Mahaa Daily Exclusive

  బంగాల్‌లో ‘మూక’స్వామ్యంపై సుప్రీంకోర్టు నిప్పులు: న్యాయాధికారుల నిర్బంధంపై ఎన్‌ఐఏ దర్యాప్తు!

Share

* బంగాల్‌లో ‘మూక’స్వామ్యం.
* న్యాయాధికారుల నిర్బంధంపై సుప్రీంకోర్టు నిప్పులు!
* మాల్దా రణరంగం.. విమానాశ్రయంలో సూత్రధారి అరెస్టు.. రంగంలోకి ఎన్‌ఐఏ!
* తొమ్మిది గంటల నరకం.. మహిళా అధికారుల బందీ.. బెంగాల్‌లో శాంతిభద్రతలు గాలికి!
* కేంద్ర బలగాల పహారాలో ఓటర్ల కేంద్రాలు!
న్యాయానికే సంకెళ్లు.. బంగాల్‌లో చెలరేగిన హింసాకాండపై సుప్రీం గర్జన!
ఢిల్లీ, మహా.
పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలు మరోసారి రక్తాశ్రితమయ్యాయి. ఎన్నికల వేళ ప్రజాస్వామ్యానికి రక్షణగా ఉండాల్సిన న్యాయాధికారులనే ఆందోళనకారులు బందీలుగా మార్చుకున్న తీరు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. మాల్దా జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ విధుల్లో ఉన్న ఏడుగురు జ్యుడీషియల్ అధికారులను, అందులోనూ ముగ్గురు మహిళా అధికారులను తొమ్మిది గంటల పాటు నిర్బంధించడం రాష్ట్రంలో శాంతిభద్రతల దుస్థితికి అద్దం పడుతోంది. ఈ ఘటనపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బంగాల్‌ను ‘అత్యంత పోలరైజ్డ్’ రాష్ట్రంగా అభివర్ణించిన ధర్మాసనం, అక్కడ రాజ్యాంగబద్ధమైన పాలన కాకుండా ‘మూకస్వామ్యం’ రాజ్యమేలుతోందని మండిపడింది. కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు అప్పగించడంతో బెంగాల్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
ఈ ఘోర కలికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న న్యాయవాది మొఫక్కురల్‌ ఇస్లాంను పోలీసులు సినిమా ఫక్కీలో అరెస్టు చేశారు. అధికారులను నిర్బంధించి, స్థానికులను ప్రసంగాలతో రెచ్చగొట్టి హింసకు ప్రేరేపించిన ఇస్లాం, విమానం ఎక్కి పారిపోయేందుకు బగ్డోగ్రా విమానాశ్రయానికి వెళ్లగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు మోతాబరి ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ సభ్యుడు మౌలానా షాజహాన్ అలీ సహా ఇప్పటివరకు 35 మందిని అరెస్టు చేశారు. ఈ అల్లర్ల వెనుక పక్కా ప్రణాళిక ఉందా అనే కోణంలో పోలీసులు 19 కేసులు నమోదు చేయగా, ఎన్‌ఐఏ బృందం ఇప్పటికే కోల్‌కతా నుంచి మాల్దాకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. జాతీయ రహదారి దిగ్బంధం, పోలీసులపై రాళ్ల దాడి, వాహనాల ధ్వంసం వంటి ఘటనలు రాష్ట్రంలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.
మరోవైపు ఈ ఘటన అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య మాటల యుద్ధానికి కేంద్రబిందువుగా మారింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ వ్యవహారం వెనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎన్నికల సంఘం కుట్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కావాలనే అల్లర్లు సృష్టించి రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం వ్యూహాలు పన్నుతోందని ఆమె మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక యంత్రాంగంపై తన పట్టు తప్పిందని, అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని దీదీ సమర్థించుకున్నారు. దీనికి కౌంటర్‌గా.. ఓటర్ల జాబితా నుంచి బోగస్ పేర్లను తొలగిస్తుండటంతో భయం పట్టుకున్న టీఎంసీ నేతలే ఉద్దేశపూర్వకంగా అధికారులపై దాడులు చేయిస్తున్నారని బీజేపీ ధ్వజమెత్తింది. అసెంబ్లీ ఎన్నికలకు మూడు వారాల సమయం మాత్రమే ఉండటంతో మాల్దాతో పాటు పలు జిల్లాల్లో నిరసనలు మిన్నంటాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఓటర్ల సవరణ కేంద్రాల వద్ద భారీగా కేంద్ర బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

Latest