* కేరళాలో రేవంత్ ‘ఏప్రిల్ ఫూల్’ డ్రామా.
* కిషన్ రెడ్డి బహిరంగ లేఖతో గుట్టురట్టు!
* ఆరు గ్యారెంటీలు అన్నీ అబద్ధాలే.. పొలిటికల్ టూరిస్టుల మాయలో పడొద్దు.
* తెలంగాణలో ‘చేయి చేయి’ మోసం.. కేరళలో కల్లబొల్లి మాటలా?
* అప్పుల కుప్పగా రాష్ట్రం.. అటకెక్కిన రుణమాఫీ..
* హస్తం హామీలన్నీ బోగస్.. తెలంగాణ అనుభవం దేశానికి పాఠం.
* కేరళ ఓటర్లకు కేంద్ర మంత్రి విజ్ఞప్తి!
హైదరాబాద్, మహా.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అద్భుతంగా అమలు చేస్తున్నామంటూ రేవంత్ రెడ్డి చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని, కేరళ ప్రజలను మభ్యపెట్టడానికే ఆయన ‘పొలిటికల్ టూరిస్ట్’గా అక్కడ వాలారని ధ్వజమెత్తారు. ఈ మేరకు కేరళ ప్రజలను ఉద్దేశించి కిషన్ రెడ్డి ఒక బహిరంగ లేఖ రాశారు. సరిగ్గా ‘ఏప్రిల్ ఫూల్స్ డే’ నాడే రేవంత్ రెడ్డి కేరళకు వచ్చి తెలంగాణలో అమలవ్వని హామీల గురించి గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో క్షేత్రస్థాయి పరిస్థితులు తెలిసిన వ్యక్తిగా, అక్కడి ప్రజలు కాంగ్రెస్ పాలనలో ఎంతలా వంచించబడుతున్నారో కేరళ వాసులకు వివరించడం తన బాధ్యతని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో రైతులకు ప్రతి ఎకరానికి రూ.15 వేలు, వరికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేటికీ ఆ ఊసే ఎత్తడం లేదని కిషన్ రెడ్డి లేఖలో ఎండగట్టారు. దాదాపు 40 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారని, నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.4 వేల భృతి ఏమైందో ఎవరికీ తెలియదని మండిపడ్డారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలంటూ ఊదరగొట్టి, పాత నోటిఫికేషన్లకు అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తూ కాలక్షేపం చేస్తున్నారని, ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని విమర్శించారు. మహిళలకు ఇస్తామన్న రూ.2,500 నగదు, తులం బంగారం హామీలు గాలికి ఎగిరిపోయాయని, దాదాపు కోటి మందికి పైగా మహిళలను రేవంత్ సర్కార్ నమ్మించి వంచించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కేంద్రం ఇచ్చే నిధులపైనే ఆధారపడుతూ, సరైన ఆర్థిక ప్రణాళిక లేకుండా రాష్ట్రాన్ని రూ.10 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేశారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో అభివృద్ధి పేరిట పేదల ఇళ్లను కూల్చేస్తూ రేవంత్ రెడ్డి నిర్దయగా వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు ముసుగులో పేదల గూడు చెడగొడుతూ, వారిని రోడ్డుపైకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, పీఆర్సీ అమలు కాక, రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు అందక అనేకమంది ఆర్థిక ఇబ్బందులతో మరణిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల అనుభవం దేశానికే ఒక గుణపాఠమని, అమలు చేయలేని హామీలతో అధికారం దక్కించుకుని ఇప్పుడు రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్ ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పారని, చైతన్యవంతులైన కేరళ ప్రజలు కూడా రేవంత్ రెడ్డి అబద్ధాలను నమ్మవద్దని కోరారు. ప్రధాని మోదీ నాయత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మాత్రమే కేరళకు సుపరిపాలన అందించగలదని, ఈసారి బీజేపీ కూటమికి అవకాశం ఇచ్చి సేవ చేసే భాగ్యం కల్పించాలని కిషన్ రెడ్డి తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.








