Mahaa Daily Exclusive

  తెలంగాణలో రెండో విడత ‘శ్వేత విప్లవం’: పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త రోడ్ మ్యాప్!

Share

* పాడి రైతు ముంగిటకు ‘శ్వేత విప్లవం’.
* గ్రామీణ ఆర్థిక పరిపుష్టే లక్ష్యం.. సీఎం రేవంత్ రెడ్డితో జాతీయ డెయిరీ దిగ్గజాల చర్చలు!
* తెలంగాణలో పాడి విప్లవానికి సరికొత్త రోడ్ మ్యాప్!
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో విప్లవాత్మక అడుగు వేశారు. వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి పరిశ్రమను అభివృద్ధి చేసి, పాడి రైతులకు గరిష్ట ప్రయోజనాలు చేకూర్చే అంశంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్ చైర్మన్ డాక్టర్ మీనేష్ షా, మదర్ డైరీ ఢిల్లీ చైర్మన్ జయతీర్థా చారి నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ భేటీలో రాష్ట్రంలో పాడి రంగాన్ని ఏ విధంగా ఆధునీకరించాలి, పాల ఉత్పత్తిని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యమంత్రి తనదైన శైలిలో రాష్ట్రంలోని పాడి రైతుల స్థితిగతులను వివరించి, జాతీయ స్థాయి సంస్థల సహకారంతో రాష్ట్రంలో రెండో విడత ‘శ్వేత విప్లవం’ తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య కూడా పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమ ద్వారా మహిళా సంఘాలను, చిన్నపాటి రైతులను ఆర్థికంగా ఆదుకోవచ్చని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఢిల్లీ మదర్ డైరీ తరహాలో రాష్ట్రంలోని డెయిరీ సంస్థలను బలోపేతం చేయాలని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి కూడా ఈ చర్చల్లో పాల్గొని, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణను దేశంలోనే అగ్రగామి పాల ఉత్పత్తి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఎన్డీడీబీ చైర్మన్ డాక్టర్ మీనేష్ షా ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి స్పష్టమైన హామీ ఇచ్చారు.
ప్రధానంగా పాడి రైతుల సంక్షేమమే పరమావధిగా ఈ భేటీ సాగింది. నూతన పాల సేకరణ కేంద్రాల ఏర్పాటు, పాడి పశువుల పంపిణీలో పారదర్శకత, మరియు పాడి రైతులకు అందాల్సిన ప్రోత్సాహకాలపై ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఎన్డీడీబీ , మదర్ డైరీ వంటి సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ముందుకు రావడం పట్ల రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కేవలం వ్యవసాయంపైనే ఆధారపడకుండా పాడి పరిశ్రమ వంటి అనుబంధ రంగాల ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంతో రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ఒక బలమైన పునాది పడిందని, త్వరలోనే క్షేత్రస్థాయిలో విప్లవాత్మక మార్పులు కనిపిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Latest