Mahaa Daily Exclusive

  తమిళనాడు కమలదళంలో కలకలం…

Share

* పొత్తుల సెగ.. అన్నామలై పేరు ‘ఔట్’.
* తమిళనాడు కమలదళంలో అనూహ్య పరిణామం.
* బరిలో మురుగన్, తమిళిసై.
* తమిళ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్!

చెన్నై, మహా.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారతీయ జనతా పార్టీ శుక్రవారం విడుదల చేసిన 27 మంది అభ్యర్థుల తొలి జాబితా రాజకీయ వర్గాల్లో పెను సంచలనానికి దారితీసింది. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత చురుకైన పాత్ర పోషిస్తూ, పార్టీకి కొత్త ఊపిరి పోసిన మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై పేరు ఈ జాబితాలో లేకపోవడం చర్చనీయాంశమైంది. పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు నాగేంద్రన్, కేంద్ర మంత్రి ఎల్. మురుగన్, మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వంటి హేమాహేమీలకు చోటు దక్కినప్పటికీ, పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లిన అన్నామలైకు మొండిచేయి ఎదురుకావడం కార్యకర్తలను విస్మయానికి గురిచేసింది. జూలై 2021 నుంచి ఏప్రిల్ 2025 వరకు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన ఆయనను ప్రత్యక్ష ఎన్నికల బరి నుంచి పక్కన పెట్టడం వెనుక అధిష్ఠానం పెద్ద వ్యూహమే పన్నినట్లు కనిపిస్తోంది.
ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా అన్నాడీఎంకేతో కుదిరిన పొత్తులే కీలక పాత్ర పోషించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అన్నాడీఎంకే-బీజేపీ మధ్య సీట్ల పంపకాల విషయంలో అన్నామలై మొదటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. బీజేపీకి పట్టున్న నియోజకవర్గాలను అన్నాడీఎంకేకు కేటాయించడంపై ఆయన గతంలోనే అధిష్ఠానానికి తన నిరసనను లేఖ రూపంలో తెలియజేశారు. దీనికితోడు, అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి ఎన్డీయే కూటమిలోకి తిరిగి రావడానికి అన్నామలైను పక్కన పెట్టాలనే నిబంధన విధించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. పొత్తుల ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్రంలో బలమైన మిత్రపక్షాన్ని కోల్పోకూడదనే ఉద్దేశంతోనే కేంద్ర నాయకత్వం అన్నామలైను బరిలోకి దింపలేదని తెలుస్తోంది.
మరోవైపు, గత 2021 ఎన్నికల్లో అరవకురిచ్చి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అన్నామలై ఓటమి పాలవడం కూడా ఈ నిర్ణయంపై ప్రభావం చూపినట్లు చర్చ జరుగుతోంది. అయితే, ఆయనకు టిక్కెట్ నిరాకరించడంపై ప్రస్తుత అధ్యక్షుడు నాగేంద్రన్ స్పందిస్తూ, ఇది పూర్తిగా కేంద్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. అభ్యర్థులుగా ప్రకటించిన 27 మంది విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్నామలైను నియోజకవర్గానికి పరిమితం చేయకుండా, రాష్ట్రవ్యాప్తంగా ప్రచారకర్తగా వాడుకోవాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు కూడా ఒక వర్గం చెబుతోంది. ఏది ఏమైనా, రాష్ట్రంలో బీజేపీకి ముఖచిత్రంగా మారిన అన్నామలై పేరు ఎన్నికల బరిలో లేకపోవడం తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త మలుపుగా పరిగణించవచ్చు. మే 4న వెలువడే ఫలితాలే ఈ వ్యూహాం ఎంతవరకు పారాయో తేల్చనున్నాయి.

Latest