* బాటిల్‌పై 15 శాతం ధర పెంపునకు రంగం సిద్ధం.
* మందుబాబులపై రోజుకు రూ. 18 కోట్ల ‘వ్యాట్’ భారం.
* తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు.
* ప్యాకేజింగ్ భారంతో మద్యం ప్రియులకు తప్పని వాత!
హైదరాబాద్, మహా.
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు, సరఫరా వ్యవస్థలో తలెత్తిన ఆటంకాలు ఇప్పుడు నేరుగా సామాన్యుడి ‘కిక్కు’పై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఖతార్ వంటి దేశాల నుంచి గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం మద్యం కంపెనీలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మద్యం తయారీ కంటే, దానిని నిల్వ చేసే గాజు బాటిళ్లు, అల్యూమినియం క్యాన్ల తయారీ ఖరీదైన వ్యవహారంగా మారడంతో.. ఆ భారాన్ని వినియోగదారులపైకి నెట్టేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఈ పరిణామం తెలంగాణలోని మద్యం ప్రియులపై రోజుకు కోట్లాది రూపాయల అదనపు భారాన్ని మోపనుంది.
బాటిళ్ల తయారీలో సెగలు
మద్యం సీసాల తయారీకి వాడే ‘ఫర్నెస్’లను నిరంతరం మండించేందుకు భారీగా కమర్షియల్ గ్యాస్ అవసరం. ప్రస్తుతం గ్యాస్ ధరలు ఆకాశాన్నంటడంతో బాటిళ్ల ఉత్పత్తి వ్యయం ఏకంగా 15 నుంచి 20 శాతం పెరిగింది. విస్కీ, బ్రాందీ వంటి స్పిరిట్స్ విభాగంలో ప్యాకేజింగ్ ఖర్చు 20 శాతంగా ఉంటే, బీర్ల విషయంలో ఇది 40 శాతం వరకు ఉంటోంది. దీనికి తోడు అల్యూమినియం ధరలు 15 శాతం పెరగడంతో క్యాన్ల ఉత్పత్తి కూడా భారమైంది. షిప్పింగ్ ఖర్చులు కూడా తోడవడంతో మద్యం ధరలను కనీసం 10 నుంచి 15 శాతం పెంచాలని తయారీ సంస్థలు ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తున్నాయి.
తెలంగాణపై ‘ధర’ ప్రభావం.. రోజుకు రూ. 18 కోట్ల భారం
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ గణాంకాలను పరిశీలిస్తే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 40,209 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. అంటే సగటున రోజుకు రూ. 110 కోట్ల నుంచి రూ. 120 కోట్ల మధ్య అమ్మకాలు సాగుతున్నాయి. ఇప్పుడు ప్రతిపాదించిన విధంగా 15 శాతం ధరలు పెరిగితే, రాష్ట్రవ్యాప్తంగా వినియోగదారులపై రోజుకు సుమారు రూ. 16.5 కోట్ల నుంచి రూ. 18 కోట్ల వరకు అదనపు భారం పడనుంది. అంటే నెలకు దాదాపు రూ. 500 కోట్ల మేర మందుబాబుల జేబులకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇది ప్రభుత్వ ఖజానాకు అదనపు ఆదాయాన్ని తెచ్చిపెట్టినప్పటికీ, సామాన్య, మధ్యతరగతి వినియోగదారుల నెలవారీ బడ్జెట్‌ను తలకిందులు చేయనుంది.
జిల్లాలవారీగా విశ్లేషణ.. గ్రేటర్ పరిధిలోనే అత్యధికం
రాష్ట్రవ్యాప్త విక్రయాల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలదే అగ్రస్థానం. రాష్ట్ర మొత్తం ఆదాయంలో దాదాపు 48 శాతం ఈ మూడు జిల్లాల నుంచే వస్తోంది. ధరల పెంపు అమల్లోకి వస్తే, ఈ ప్రాంతాల్లోని వినియోగదారులపైనే రోజుకు రూ. 8 కోట్ల వరకు భారం పడనుంది. దక్షిణ తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం జిల్లాలు విక్రయాల్లో తర్వాతి స్థానాల్లో ఉండగా, అక్కడ రోజుకు రూ. 1.5 కోట్ల నుంచి రూ. 2 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో వరంగల్, కరీంనగర్ జిల్లాలు కూడా అధిక వినియోగం కలిగిన ప్రాంతాలు కావడంతో అక్కడ కూడా ధరల సెగ తీవ్రంగానే ఉండనుంది.
వేసవి డిమాండ్.. సరఫరా కష్టాలు
ప్రస్తుతం వేసవి కాలం కావడంతో బీర్ల డిమాండ్ గరిష్ట స్థాయిలో ఉంది. సాధారణంగా ఎండకాలంలో బీర్ల అమ్మకాలు 30 నుంచి 40 శాతం పెరుగుతాయి. ఒకవేళ గ్యాస్ కొరత వల్ల బాటిళ్ల ఉత్పత్తి నిలిచిపోతే, మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ధర పెరగడమే కాకుండా, కావాల్సిన బ్రాండ్లు అందుబాటులో లేకపోవడం మందుబాబులను మరింత ఇబ్బంది పెట్టే అంశం. అంతర్జాతీయ గ్యాస్ మార్కెట్ కుదుటపడే వరకు ఈ ‘ధర’ వేడి తగ్గదని విపణి వర్గాలు అంచనా వేస్తున్నాయి.








