Mahaa Daily Exclusive

  గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై ‘హస్తం’ దాడి..రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు నిప్పులు..

Share

  •  రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు నిప్పులు.
  •  ఇది ‘ప్రజా పాలన’ కాదు.. పక్కా ‘గూండా’ రాజ్యం.
  •  రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడ? పోలీసులు ప్రైవేట్ సైన్యమా?: డీజీపీకి హరీశ్ రావు సూటి ప్రశ్న

హైదరాబాద్, మహా.

రాష్ట్రంలో రాజకీయ కక్షసాధింపులు పరాకాష్టకు చేరాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు జరిపిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ దాడి ముమ్మాటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని, ప్రజాస్వామ్య వ్యవస్థపై సీఎం స్వయంగా చేయించిన దాడి అని ఆయన అభివర్ణించారు. పట్టపగలే అధికార మదంతో విర్రవీగుతూ ప్రజాప్రతినిధుల కార్యాలయాలపై దాడులకు తెగబడటం చూస్తుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల తీరు బీహార్ గ్యాంగ్‌లను తలపిస్తోందని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా? లేవా? అని ప్రశ్నించిన హరీశ్ రావు, ఏకంగా మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కార్యాలయంపైనే ముప్పేట దాడులు జరుగుతుంటే పోలీసు యంత్రాంగం ఏం చేస్తోందని నిలదీశారు. రక్షక భట నిలయాలు కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిపోయాయా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు, చివరికి మీడియా పైన కూడా దాడులు నిత్యకృత్యం కావడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఒకవైపు ‘హేట్ స్పీచ్ బిల్’ పేరుతో ప్రజలు, విపక్షాల నోళ్లు మూయిస్తూ.. మరోవైపు తమ గూండాలతో భౌతిక దాడులు చేయించడమేనా రేవంత్ రెడ్డి చెబుతున్న ‘ప్రజా పాలన’ అని ఆయన నిలదీశారు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు, గూండా రాజ్యమని ఆయన ధ్వజమెత్తారు.

ముఖ్యమంత్రి, మంత్రుల తీరుపై కూడా హరీశ్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి, సీఎం రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాల్లో పొలిటికల్ టూర్లు, ఎన్నికల ప్రచారాల్లో బిజీగా ఉన్నారని విమర్శించారు. మంత్రులు ఇతర రాష్ట్రాల ఎన్నికల కోసం తిరుగుతుంటే ఇక్కడ ప్రజల సమస్యలను, శాంతిభద్రతలను ఎవరు పర్యవేక్షిస్తారని ఆయన ప్రశ్నించారు. ఏడవ గ్యారంటీగా ‘ప్రజాస్వామ్య పునరుద్ధరణ’ అని డబ్బా కొట్టుకున్న కాంగ్రెస్, ఇప్పుడు ఉన్న ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులను గుర్తు చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రభుత్వం నుంచి ఏమైనా సందేశాలు వెళ్లాయా? అందుకే పోలీసులు చూస్తూ ఊరుకుంటున్నారా? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

అణచివేతలకు, నిర్బంధాలకు బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ అదరదని, బెదరదని హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తామని, ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ గూండాలను వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని రాష్ట్ర డీజీపీని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులను తక్షణమే ఆపకపోతే, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలే వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుందని, అప్పుడు జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హరీశ్ రావు హెచ్చరించారు. “తస్మాత్ జాగ్రత్త” అంటూ అధికార పక్షానికి ఆయన గట్టి హెచ్చరిక జారీ చేశారు.

Latest