Mahaa Daily Exclusive

  ముదురుతున్న అగ్రరాజ్యం – ఇరాన్ పోరు..

Share

  •  నింగిలో సమరం.. నేలపై భావోద్వేగం!
  •  అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చిన ఇరాన్..
  •  ఒక పైలట్ ఆచూకీ గల్లంతు.
  •  ఇరాన్ రాయబార కార్యాలయాల వ్యంగ్యాస్త్రాలు.
  •  ట్రంప్‌తోనే మీ కుమారుడికి ముప్పు అంటూ పాకిస్థాన్‌లోని ఇరాన్ ఎంబసీ వివాదాస్పద ట్వీట్.

 

వాషింగ్టన్,మహా :

అమెరికా-ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ మేఘాలు రోజురోజుకు మరింత గాఢమవుతున్నాయి. ఇరు పక్షాల మధ్య దాడులు, ప్రతిదాడులు ప్రారంభమై నెల రోజులు దాటినా శాంతి దిశగా అడుగులు పడకపోగా, ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుతున్నాయి. తాజాగా నింగిలో సాగిన పోరులో అమెరికాకు చెందిన అత్యాధునిక ఎఫ్-15 యుద్ధ విమానంతో పాటు ఏ-10 అటాక్ విమానాన్ని ఇరాన్ దళాలు కూల్చివేయడం రక్షణ రంగ నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అమెరికా విమానాలను ఇరాన్ నేలమట్టం చేయడం యుద్ధ గమనాన్ని మార్చేలా కనిపిస్తోంది. ఎఫ్-15 విమానం కూలిపోతున్న సమయంలో ఇద్దరు పైలట్లు పారాచూట్ల సాయంతో ప్రాణాలు కాపాడుకోగా, వారిలో ఒకరిని అమెరికా రెస్క్యూ బృందాలు క్షేమంగా కాపాడగలిగాయి. అయితే మరో పైలట్ ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాకపోవడం అగ్రరాజ్యాన్ని ఆందోళనలో పడేసింది.

ఈ యుద్ధం కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా సోషల్ మీడియా వేదికగా భావోద్వేగాల పోరుగా మారుతోంది. గల్లంతైన పైలట్ తల్లి తన కుమారుడి కోసం సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కంటతడి పెట్టిస్తోంది. తప్పిపోయిన పైలట్ తన కుమారుడేనని వెల్లడిస్తూ, అతడి క్షేమం గురించి ఎలాంటి సమాచారం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడితో పాటు యుద్ధ క్షేత్రంలో ఉన్న ఇతర పైలట్లందరి కోసం ప్రార్థించమని ఆమె చేసిన విన్నపం నెటిజన్ల మనసు గెలుచుకుంది. అయితే ఈ భావోద్వేగ పోస్ట్‌పై ఇరాన్ రాయబార కార్యాలయాలు స్పందించిన తీరు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. దౌత్య మర్యాదలను పక్కన పెట్టి, ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం ఇరాన్ చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా పాకిస్థాన్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం చేసిన ట్వీట్ సంచలనం సృష్టించింది. డొనాల్డ్ ట్రంప్ చెంత ఉండటం కన్నా, ఇరాన్ చెరలో ఉండటమే ఆ పైలట్‌కు సురక్షితమని, అమెరికన్ రెస్క్యూ బృందాలు అతడిని కనుగొనే వరకు అతను తమ దగ్గరే ఉండేలా ప్రార్థించమంటూ ఆ తల్లికి ఉచిత సలహా ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడి వల్ల ఆ పైలట్‌కు ప్రాణాపాయం ఉందన్నట్లుగా ఇరాన్ ఎంబసీ వ్యాఖ్యానించడం దౌత్యపరమైన దుమారానికి దారితీసింది. అటు దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా ఇదే బాటలో స్పందిస్తూ, తాము ఖైదీలను ఎంతో గౌరవంగా చూస్తామని గొప్పలు చెప్పుకుంది. ఇరాన్ ప్రాచీన నాగరికతను ప్రస్తావిస్తూ, అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ లాగా తాము ఖైదీలను క్రూరంగా హింసించబోమని వెల్లడించింది. ఒకవైపు క్షేత్రస్థాయిలో క్షిపణుల వర్షం కురుస్తుంటే, మరోవైపు డిజిటల్ మాధ్యమాల్లో సాగుతున్న ఈ మాటల యుద్ధం ఇరు దేశాల మధ్య శత్రుత్వం ఏ స్థాయికి చేరిందో స్పష్టం చేస్తోంది.

Latest