- విద్యార్థుల అస్వస్థతపై సుమోటోగా విచారణ.. కలెక్టర్‌కు నోటీసులు.
- జీవించే హక్కుకు భంగం కలిగించడమే: డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్.
- ఏప్రిల్ 27లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశం.
ఆసిఫాబాద్, మహా.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం ఎల్లూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకున్న ఆహార కలుషితం ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. పాఠశాలలోని విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు పత్రికల్లో వచ్చిన వార్తలను తీవ్రంగా పరిగణించిన కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ధర్మాసనం, శనివారం ఈ ఉదంతాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. నిల్వ ఉంచిన ఆహారాన్ని వడ్డించడం వల్లే ఆరుగురు విద్యార్థులతో పాటు ఒక ఉపాధ్యాయుడు తీవ్ర అస్వస్థతకు గురై కాగజ్‌నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైనంపై కమిషన్ విచారం వ్యక్తం చేసింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడటం ముమ్మాటికీ అధికారుల నిర్లక్ష్యమేనని కమిషన్ అభిప్రాయపడింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి కల్పించిన జీవించే హక్కుతో పాటు, మెరుగైన ఆరోగ్య హక్కుకు ఈ ఘటన భంగం కలిగించిందని కమిషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వ విద్యార్థుల పట్ల ఇంతటి అశ్రద్ధ వహించడం అమానుషమని, దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ ఘటనపై తక్షణమే స్పందించి, అసలు ఏం జరిగిందనే అంశంపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఏప్రిల్ 27వ తేదీలోగా సమగ్ర నివేదికను తమ ముందు ఉంచాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌ను కమిషన్ ఆదేశించింది. విద్యా సంస్థల్లో ఆహార నాణ్యత విషయంలో నిబంధనలు పాటించని వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో కూడా నివేదికలో స్పష్టంగా పేర్కొనాలని సూచించింది.
ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనంపై పర్యవేక్షణ లోపించిందని, నిల్వ ఉన్న ఆహారాన్ని పెట్టి చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం క్షమించరాని నేరమని మానవ హక్కుల కమిషన్ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయుడికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కమిషన్ ఈ సందర్భంగా గుర్తు చేసింది. మానవ హక్కుల కమిషన్ నేరుగా రంగంలోకి దిగడంతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది.








