- అబద్ధాలు ఆడటంలో రేవంత్ రెడ్డికి ‘ఆస్కార్’ ఇవ్వొచ్చు.
- హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ నిర్మిస్తే సహించేది లేదు: బండి సంజయ్ హెచ్చరిక
కరీంనగర్, మహా.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడటంలో ఆరితేరిపోయారని, ఆయనకు అబద్ధాల విభాగంలో ఆస్కార్ అవార్డు ఇవ్వవచ్చని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. శనివారం హుజురాబాద్ శివారులో ప్రతిపాదిత డంపింగ్ యార్డు నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు కావడం లేదని, నిరుద్యోగ భృతి ఊసే లేదని, కనీసం పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన నగదు కూడా అందడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో హామీలు అమలవుతున్నాయని నిరూపిస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని, లేని పక్షంలో ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని బహిరంగ సవాల్ విసిరారు. ఇతర రాష్ట్రాలైన బీహార్, మహారాష్ట్ర, హర్యానాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి రేవంత్ రెడ్డి ప్రచారమే ప్రధాన కారణమని, త్వరలో కేరళలోనూ అదే పరిస్థితి పునరావృతమవుతుందని జోస్యం చెప్పారు. ఢిల్లీ పెద్దలకు ప్రత్యేక విమానాల్లో డబ్బు మూటలు పంపుతున్నారని ఆరోపించిన ఆయన, కేరళ మీడియా ఇక్కడికి వచ్చి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు.
హుజురాబాద్ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటును బండి సంజయ్ తీవ్రంగా వ్యతిరేకించారు. నెమళ్లు, వివిధ రకాల పక్షులకు నిలయమైన ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డు నిర్మిస్తే పర్యావరణానికి భారీ ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తాము డంపింగ్ యార్డులకు వ్యతిరేకం కాదని, కానీ అవి ప్రజలకు ఇబ్బంది లేని దూర ప్రాంతాల్లో ఉండాలని స్పష్టం చేశారు. ఈ నిర్మాణ స్థలాన్ని ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించాలని లేదా పూర్తి నివేదిక తెప్పించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రయోజనాల కోసం లాఠీ దెబ్బలు తినడానికైనా సిద్ధమని, కానీ హుజురాబాద్‌లో డంపింగ్ యార్డును మాత్రం నిర్మించనివ్వబోమని అధికారులను హెచ్చరించారు. గతంలో సెంట్రల్ యూనివర్సిటీలో చేసిన అరాచకాలను ఇక్కడ సాగనివ్వబోమని, ప్రజాస్వామ్యబద్ధంగా తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.








