Mahaa Daily Exclusive

  అగ్రరాజ్య సంస్థలపై ఇరాన్ ‘ఉగ్ర’ ముద్ర..! 18 అమెరికన్ కంపెనీలే లక్ష్యంగా ఐఆర్‌జీసీ హెచ్చరికలు.. గూఢచారి ఆరోపణలు..

Share

  •  టెక్ లోకంలో ప్రకంపనలు!
  •  డెల్ కంపెనీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ఇరాన్ ప్రభుత్వం.
  •  ఉద్యోగులకు అంతర్గత హెచ్చరికలు జారీ చేసిన డెల్ యాజమాన్యం.
  •  18 అమెరికన్ కంపెనీలే లక్ష్యంగా ఐఆర్‌జీసీ హెచ్చరికలు.. గూఢచారి ఆరోపణలు.

 

వాషింగ్టన్, మహా.

 

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్న వేళ, ఇరాన్ ప్రభుత్వం తీసుకున్న ఒక సంచలన నిర్ణయం అంతర్జాతీయ టెక్నాలజీ రంగంలో కలకలం రేపుతోంది. అమెరికాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ దిగ్గజం ‘డెల్’ సంస్థను ఇరాన్ అధికారికంగా ఉగ్రవాద సంస్థగా అభివర్ణించింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన, సైనికపరమైన పోరు పతాక స్థాయికి చేరిన తరుణంలో, ఒక వ్యాపార సంస్థపై ఇరాన్ ఈ తరహా ముద్ర వేయడం గమనార్హం. ఈ పరిణామం కేవలం డెల్ సంస్థకే పరిమితం కాకుండా, అగ్రరాజ్యానికి చెందిన మరిన్ని దిగ్గజ కంపెనీలను టార్గెట్ చేసే దిశగా ఇరాన్ అడుగులు వేస్తోంది.

ఇరాన్ ప్రకటించిన ఈ కఠిన నిర్ణయంపై డెల్ యాజమాన్యం తక్షణమే స్పందించి తన ఉద్యోగులను అప్రమత్తం చేసింది. తమ సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అంతర్గత మెమో జారీ చేసిన కంపెనీ, ఉద్యోగులెవరూ ప్రస్తుతం ఇరాన్ పర్యటనలకు వెళ్లవద్దని కఠిన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ఇరాన్‌లో ఉన్న వారు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించింది. అంతేకాకుండా, ఇరాన్ దేశానికి చెందిన ఏ సంస్థతో గానీ, వ్యక్తులతో గానీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎటువంటి వ్యాపార సంబంధాలు పెట్టుకోవద్దని స్పష్టం చేసింది. కంపెనీకి చెందిన డేటా మరియు నెట్‌వర్క్ భద్రతపై ఐటీ విభాగాలు మరింత అప్రమత్తంగా ఉండాలని, సైబర్ దాడులు జరిగే అవకాశం ఉన్నందున నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించింది.

మరోవైపు ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ కార్ప్ (IRGC) చేసిన ప్రకటన అమెరికా కార్పొరేట్ వర్గాల్లో ఆందోళన నింపింది. అమెరికాకు చెందిన మొత్తం 18 ప్రముఖ ఐటీ మరియు ఫైనాన్స్ కంపెనీలే తమ తదుపరి లక్ష్యమని ఐఆర్‌జీసీ తన అధికారిక టెలిగ్రామ్ ఛానల్ ద్వారా హెచ్చరించింది. ఈ ప్రముఖ సంస్థలన్నీ అమెరికా ప్రభుత్వానికి గూఢచారులుగా వ్యవహరిస్తున్నాయని, తమ దేశ రహస్యాలను సేకరిస్తున్నాయని ఇరాన్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. గత మార్చి నెలలో ఇచ్చిన హెచ్చరికలనే పునరావృతం చేస్తూ, ఈసారి నేరుగా కంపెనీల పేర్లను ప్రస్తావించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. క్షిపణులు, డ్రోన్లతో సాగుతున్న ఈ యుద్ధం ఇప్పుడు గ్లోబల్ టెక్నాలజీ మరియు ఆర్థిక వ్యవస్థల వైపు మళ్లుతుండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Latest