Mahaa Daily Exclusive

  మాచర్ల అమానుషంపై మహిళా కమిషన్ గర్జన..

Share

  •  నిందితుడిని తక్షణమే అరెస్టు చేయండి!*బాధితురాలికి ఫోన్ చేసిన చైర్‌పర్సన్ రాయపాటి.
  •  శైలజ.. అండగా ఉంటామని భరోసా.
  •  ఆడవారి జోలికొస్తే ఉపేక్షించేది లేదు.
  •  కామాంధులకు కఠిన హెచ్చరిక

గుంటూరు, మహా.

పల్నాడు జిల్లా మాచర్లలో ఓ ప్రభుత్వ ఉద్యోగినిపై జరిగిన అమానుష దాడి మరియు అత్యాచారం ఘటనపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. తెలుగు రాష్ట్రాలను వణికించిన ఈ పైశాచిక ఘటనను తీవ్రంగా పరిగణించిన కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ, నిందితుడిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం ఆమె గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలికి ఫోన్ చేసి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడమే కాకుండా, కమిషన్ మరియు ప్రభుత్వం ఆమెకు అన్ని విధాలా అండగా ఉంటాయని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ, మహిళల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఆడవారిపై ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని కామాంధులను హెచ్చరించారు. బాధితురాలికి అవసరమైన వైద్య సహాయంతో పాటు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని అధికారులకు సూచించారు.

ఈ భయంకరమైన ఘటన ఏప్రిల్ 2వ తేదీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. మాచర్లలో నివాసం ఉంటున్న సదరు ప్రభుత్వ ఉద్యోగిని ఇంటికి వెళ్లిన నిందితుడు, తొలుత మంచినీళ్లు కావాలంటూ తలుపు తట్టాడు. ఆమె తలుపు తీయగానే బలవంతంగా ఇంట్లోకి చొరబడి అమానుషానికి ఒడిగట్టాడు. బాధితురాలు కేకలు వేయకుండా ఆమె నోట్లో బట్టలు కుక్కి అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, పైశాచికంగా కత్తితో గాయపరిచాడు. అంతటితో ఆగక మర్మాంగాల పైనా రాడ్డుతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. నిందితుడి దాడిలో తీవ్ర రక్తస్రావమై స్పృహ కోల్పోయిన బాధితురాలిని గమనించిన వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (GGH) లో చికిత్స పొందుతుండగా, ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకుని నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

మహిళా రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని రాయపాటి శైలజ స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఉద్యోగినిపై ఆమె ఇంట్లోనే ఇలాంటి దాడి జరగడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు కమిషన్ పర్యవేక్షణ కొనసాగుతుందని, నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారని ఆమె తెలిపారు. ఈ ఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతుండగా, బాధితురాలి ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు.

Latest