Mahaa Daily Exclusive

  మహిళా కోటాపై బీజేపీ సమరశంఖం: 2029 నుంచే రిజర్వేషన్ల అమలు!

Share

  • మహిళా రిజర్వేషన్లపై బీజేపీ దేశవ్యాప్త ప్రచారం.
  • మహిళా బిల్లుపై కమలదళం భారీ కార్యాచరణ.
  • 2029 నుంచి మహిళా కోటా అమలు.

ఢిల్లీ, మహా.
నారీ శక్తి వందన్ అధినియం (మహిళా రిజర్వేషన్ల బిల్లు)పై దేశవ్యాప్తంగా చైతన్యం నింపేందుకు భారతీయ జనతా పార్టీ భారీ కార్యాచరణకు సిద్ధమైంది. చారిత్రక ప్రాధాన్యత ఉన్న ఈ చట్టం గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించడంతో పాటు, దీని ప్రాముఖ్యతను చాటిచెప్పేలా విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు దిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, ఇన్-ఛార్జిలతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ కీలక భేటీలో తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు (తెలంగాణ), పి.వి.ఎన్. మాధవ్ (ఆంధ్రప్రదేశ్) కూడా పాల్గొని, తమ రాష్ట్రాల్లో చేపట్టబోయే ప్రచార ప్రణాళికలను వివరించారు. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న మూడు రోజుల ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల అమలు దిశగా కీలక సవరణలు తీసుకువచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.
ఈ సవరణల ప్రకారం, పెండింగ్‌లో ఉన్న జనాభా గణన మరియు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో సంబంధం లేకుండానే మహిళా రిజర్వేషన్లను అమలు చేసేలా కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 2011 జనాభా గణన ప్రాతిపదికన ఈ రిజర్వేషన్లను 2029 సార్వత్రిక ఎన్నికల నుంచే అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల లోక్‌సభ స్థానాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 543 నుంచి 816 వరకు పెరిగే అవకాశం ఉండగా, అందులో మూడో వంతు అంటే సుమారు 273 స్థానాలు మహిళలకు కేటాయించబడతాయి. ఈ మార్పుల ద్వారా మహిళా ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతుందని పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13న మహిళా పారిశ్రామికవేత్తలు, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా మహిళలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేస్తూ సదస్సులు, సోషల్ మీడియా ప్రచారాలు నిర్వహించాలని రాష్ట్ర యూనిట్లకు అధిష్టానం దిశానిర్దేశం చేసింది. చట్టంపై జరుగుతున్న ఈ విస్తృత ప్రచారం రాబోయే ఎన్నికల్లో పార్టీకి రాజకీయంగా కూడా బలాన్ని ఇస్తుందని బీజేపీ నాయకత్వం విశ్వసిస్తోంది.

Latest