Mahaa Daily Exclusive

  అభిశంసన భయంతో జస్టిస్ వర్మ రాజీనామా.. నోట్ల కట్టల కేసులో కీలక నిర్ణయం..

Share

ఢిల్లీ, మహా.

నగదు కట్టల వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. తనపై అభిశంసన ప్రక్రియ వేగవంతమైన నేపథ్యంలో, పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఏప్రిల్ 9న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు రాజీనామా లేఖను పంపారు. తీవ్ర మనోవేదనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్న ఆయన, తన రాజీనామా వెనుక ఉన్న కారణాలను వివరించి రాష్ట్రపతి కార్యాలయానికి భారం కలిగించడం ఇష్టం లేదని లేఖలో స్పష్టం చేశారు. అలహాబాద్ హైకోర్టులో సేవ చేయడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని చెబుతూనే, తక్షణమే విధులను వీడుతున్నట్లు వెల్లడించారు. ఈ రాజీనామా ప్రతిని భారత ప్రధాన న్యాయమూర్తికి కూడా అందజేశారు.

ఈ వివాదానికి మూలాలు గతేడాది మార్చి 14న దిల్లీలో జరిగిన ఒక అగ్నిప్రమాదంలో ఉన్నాయి. అప్పట్లో దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో మంటలు చెలరేగగా, వాటిని ఆర్పేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి ఊహించని దృశ్యం ఎదురైంది. ఇంట్లో భారీ ఎత్తున కాలిపోయిన నోట్ల కట్టలు బయటపడటంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు రావడంతో సుప్రీంకోర్టు ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడమే కాకుండా, అంతర్గత విచారణకు ఆదేశించింది. ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కూడిన కమిటీ ఈ వ్యవహారాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేసి, నోట్ల కట్టలు దొరికిన మాట వాస్తవమేనని తేల్చింది. ఆయన ప్రవర్తన న్యాయవృత్తికే కళంకం తెచ్చేలా ఉందని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది.

విచారణ కమిటీ నివేదికను సవాల్ చేస్తూ జస్టిస్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆయనకు చుక్కెదురైంది. అత్యున్నత న్యాయస్థానం ఆయన పిటిషన్‌ను కొట్టివేయడంతో పాటు, పదవి నుంచి తప్పుకోవాలని సూచించింది. అయినప్పటికీ ఆయన రాజీనామాకు నిరాకరించడంతో, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిశంసన ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్రపతి, ప్రధానిలకు లేఖలు రాశారు. అటు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కూడా వివిధ పార్టీల విజ్ఞప్తి మేరకు మరో త్రిసభ్య కమిటీని వేసి విచారణ జరిపించారు. పార్లమెంటులో అభిశంసన తీర్మానం ఖాయమని తేలడంతో, ఆ అవమానం నుంచి తప్పించుకునేందుకు జస్టిస్ యశ్వంత్ వర్మ చివరకు రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ రాజీనామాతో ఆయనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ ముగిసినట్లేనని లోక్‌సభ సెక్రటేరియట్ వర్గాలు భావిస్తున్నాయి. ఒక ఉన్నత న్యాయమూర్తి అవినీతి ఆరోపణలతో ఇలా పదవిని వీడటం న్యాయవ్యవస్థలో చర్చనీయాంశంగా మారింది.

Latest