Mahaa Daily Exclusive

  భాగ్యనగర రౌడీల నరాల్లో ‘గంజాయి’ సెగ: 189 మందికి డ్రగ్స్ పాజిటివ్!

Share

  • రౌడీమూకల నరనరాల్లో మాదకద్రవ్యాల విషం.
  • డ్రగ్స్‌ వేటలో వెలుగుచూసిన నగ్నసత్యాలు.
  • నగర పోలీస్‌ ఉక్కుపాదం.. 189 పాజిటివ్‌.

హైదరాబాద్, మహా.

భాగ్యనగరంలో నేరస్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయడమే కాకుండా, వారిని పట్టిపీడిస్తున్న వ్యసనాలపై హైదరాబాద్‌ పోలీసులు సర్జికల్ స్ట్రైక్ నిర్వహించారు. నగర పోలీస్‌ కమిషనర్‌ వి.సి. సజ్జనార్‌ జారీ చేసిన ఆదేశాల మేరకు పోలీసులు చేపట్టిన డ్రగ్స్‌ పరీక్షలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. నగరవ్యాప్తంగా ఉన్న 1300 మంది రౌడీషీటర్లపై దృష్టి సారించిన ఉన్నతాధికారులు, మొదటి విడతలో భాగంగా ఎంపిక చేసిన వ్యక్తులకు పరీక్షలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తేలిన వాస్తవాలు పోలీసు యంత్రాంగాన్ని సైతం విస్మయానికి గురిచేశాయి. మొత్తం 239 మందికి పరీక్షలు చేయగా, అందులో ఏకంగా 189 మంది శరీరంలో మాదకద్రవ్యాల అవశేషాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. కేవలం 50 మందికి మాత్రమే నెగటివ్‌ రావడంతో, రౌడీషీటర్లలో అధిక శాతం గంజాయి మత్తులో మునిగి తేలుతున్నట్లు స్పష్టమైంది.
పరీక్షల నిర్వహణ కోసం పోలీసులు ఎంచుకున్న ఆసుపత్రుల వారీగా గణాంకాలు పరిశీలిస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో పరీక్షించిన 89 మందిలో ఏకంగా 86 మందికి పాజిటివ్‌ రావడం గమనార్హం. ఇక్కడ అత్యధికంగా 96 శాతం మంది డ్రగ్స్‌ వాడుతున్నట్లు తేలింది. అటు ఉస్మానియా ఆసుపత్రిలో 80 మందికి పరీక్షలు చేయగా 59 మందికి, గాంధీ ఆసుపత్రిలో 70 మందికి చేయగా 44 మందికి పాజిటివ్‌ ఫలితాలు వచ్చాయి. వీరంతా గంజాయికి బానిసలైనట్లు గుర్తించిన పోలీసులు, అసలు ఈ మత్తు పదార్థాలు ఎక్కడ నుంచి సరఫరా అవుతున్నాయి? వీటి వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? అనే కోణంలో విచారణను ముమ్మరం చేశారు. డ్రగ్స్‌ అలవాటున్న నేరస్తుల వల్ల సమాజానికి మరింత ముప్పు పొంచి ఉందని భావించిన పోలీసులు, పాజిటివ్‌ వచ్చిన వారందరిపై కేసులు నమోదు చేశారు.
మరోవైపు, పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట పరిధిలో గురువారం అర్ధరాత్రి పోలీసులు చేపట్టిన రాపిడ్‌ టెస్టులు సంచలనం సృష్టించాయి. నిద్రపోతున్న రౌడీషీటర్లను అదుపులోకి తీసుకుని జరిపిన ఈ పరీక్షల్లో మతీన్ జబ్రీ, హశం, రెహన్, వజహత్ అలీ వంటి కిరాతక నేరస్తులకు పాజిటివ్‌ వచ్చింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు న్యాయాధికారుల ముందు హాజరుపరిచారు. కేవలం శిక్షించడం మాత్రమే కాకుండా, మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో వైద్యులు మరియు మానసిక నిపుణులతో కౌన్సెలింగ్‌ కూడా ఇప్పిస్తున్నారు. నగరంలో డ్రగ్స్‌ వినియోగించే వారిపై, విక్రయించే వారిపై కనికరం లేకుండా ఉక్కుపాదం మోపుతామని పోలీస్‌ కమిషనర్‌ ఈ సందర్భంగా హెచ్చరించారు. మత్తు చిక్కుల్లో ఉన్న నేరస్తులను ఏరిపారేయడం ద్వారా నగరంలో శాంతిభద్రతలను కాపాడటమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది.

Latest