Mahaa Daily Exclusive

  మహిళల భద్రతకు ‘షీ నేత్ర’ కవచం: రహస్య కెమెరాల గుట్టు రట్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు!

Share

  • మహిళా రక్షణకు షీ నేత్ర బృందాలు.
  • రహస్య కెమెరాల వేటలో హైదరాబాద్ పోలీస్.
  • ట్రయల్ రూమ్ నిఘాపై సజ్జనర్ హెచ్చరిక.

హైదరాబాద్, మహా.
హైదరాబాద్ నగరంలో మహిళల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే అసాంఘిక శక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసు యంత్రాంగం సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. హోటళ్లు, షాపింగ్ మాల్స్, హాస్టళ్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో రహస్య కెమెరాల ముప్పు నుంచి రక్షణ కల్పించే లక్ష్యంతో ‘షీ నేత్ర’ పేరిట ఏడు ప్రత్యేక బృందాలను నగర పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనర్‌ శుక్రవారం ప్రారంభించారు. బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ బృందాలకు అత్యాధునిక కెమెరా డిటెక్టర్లను అందజేసిన ఆయన, మహిళల ఆత్మగౌరవంతో ఆటలాడుకునే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. నగరంలోని ఏడు జోన్లకు ఒక్కో బృందం చొప్పున కేటాయించిన ఈ టీమ్స్, ఆకస్మిక తనిఖీల ద్వారా నిఘా కెమెరాల గుట్టు రట్టు చేయనున్నాయి.
ఈ ప్రత్యేక బృందాలకు ఇప్పటికే రెండు దశల్లో సాంకేతిక శిక్షణ పూర్తి చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. ముఖ్యంగా షాపింగ్ మాల్స్‌లోని ట్రయల్ రూమ్‌లు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, వసతి గృహాల్లో మహిళలకు తెలియకుండా కెమెరాలు అమర్చడం తీవ్రమైన నేరమని, ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తే సంబంధిత యాజమాన్యాలపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. తమ ప్రాంగణాల్లో రహస్య కెమెరాలు లేవని నిర్ధారించుకోవాల్సిన పూర్తి బాధ్యత ఆయా సంస్థలదేనని, అజాగ్రత్తగా వ్యవహరించే సంస్థలను అవసరమైతే బ్లాక్ లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. దీనికోసం ప్రతి సంస్థ తప్పనిసరిగా ‘కస్టమర్ సేఫ్టీ ఇన్ చార్జి’ని నియమించుకోవాలని, వీరు పోలీసుల షీ టీమ్స్‌తో సమన్వయం చేసుకుంటూ నిరంతరం తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు.
మహిళల భద్రత అనేది సమాజ సమిష్టి బాధ్యత అని అభివర్ణించిన సజ్జనర్, ప్రజలు కూడా ఎక్కడైనా అనుమానాస్పద పరికరాలను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. డయల్ 100 లేదా షీ టీమ్స్ ప్రత్యేక నంబర్ 9490616555 కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఈ బృందాలు నిర్వహించే ముమ్మర తనిఖీలు మహిళల్లో భరోసా కల్పిస్తాయని పోలీస్ శాఖ విశ్వసిస్తోంది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని, ఈ కొత్త నిఘా వ్యవస్థ ద్వారా నేరస్థుల ఆట కట్టించడం ఖాయమని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నగర శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా చేపట్టిన ఈ వినూత్న చర్య ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Latest