Mahaa Daily Exclusive

  నేరగాళ్లతో రాజకీయం వొద్దు.

Share

*అప్రమత్తంగా ఉండండి.. మంత్రులకు బాబు దిశానిర్దేశం.
*వ్యవస్థ ప్రక్షాళనపై చంద్రబాబు సీరియస్.

విజయవాడ, మహా.

రాష్ట్రంలో రాజకీయాల ముసుగులో సాగుతున్న నేరపూరిత కుట్రలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులను తీవ్రస్థాయిలో అప్రమత్తం చేశారు. సచివాలయంలో దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన మంత్రివర్గ సమావేశం అనంతరం, రాజకీయ పరిణామాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. కరుడుగట్టిన నేరస్థులతో రాజకీయం చేయడం కత్తి మీద సాము వంటిదని, అలాంటి వారితో వ్యవహరించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని మరుగున పరుస్తూ, లేని విషయాన్ని ఉన్నట్టుగా.. ఉన్నదాన్ని లేనట్టుగా ప్రచారం చేసే కుట్రలు నిత్యం జరుగుతున్నాయని, ఇలాంటి తప్పుడు ప్రచారాలను మంత్రులు వెనువెంటనే తిప్పికొట్టాలని ఆదేశించారు. ప్రజలకు వాస్తవాలను వివరిస్తూ వారిని చైతన్యపరచాల్సిన బాధ్యత మంత్రులపైనే ఉందని, బెదిరింపు రాజకీయాలకు తలొగ్గకుండా ధీటుగా ఎదుర్కోవాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల అమలులో మంత్రులు కేవలం పర్యవేక్షకులుగా కాకుండా, ‘ఓనర్ షిప్’ తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. జలధార, సూర్యఘర్, పీఎం కుసుమ్, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ వంటి కీలక కార్యక్రమాల్లో ప్రతి మంత్రి చురుగ్గా పాల్గొనాలని ఆదేశించారు. ముఖ్యంగా పాస్ పుస్తకాల పంపిణీకి సంబంధించి ప్రతి మంత్రి కనీసం నాలుగు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొని రైతులకు భరోసా కల్పించాలని సూచించారు. జలధార పథకానికి ఉపాధి హామీ నిధులను అనుసంధానం చేస్తూ పనులు వేగవంతం చేయాలని, సూర్యఘర్ పథకం కింద రాష్ట్రంలో గరిష్ట స్థాయిలో సోలార్ కనెక్షన్లు ఇచ్చేలా కార్యాచరణ ఉండాలని దిశానిర్దేశం చేశారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా గ్రామాలను వ్యాధి రహితంగా మార్చేందుకు నిరంతరం కృషి చేయాలని మంత్రులకు స్పష్టం చేశారు.
ఇదే సమయంలో అధికార యంత్రాంగం, ముఖ్యంగా కార్యదర్శుల పనితీరుపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేబినెట్ భేటీ ప్రారంభమైనా అజెండా ప్రతి తమకు అందలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావించగా, ముఖ్యమంత్రి అధికారుల తీరును తప్పుబట్టారు. గతంలో కార్యదర్శులు ప్రతి సబ్జెక్టుపై లోతైన అవగాహనతో ఉండేవారని, చర్చల్లో వచ్చే సందేహాలను వెంటనే నివృత్తి చేసేవారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవస్థలు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయని, ఈ ధోరణి మారాలని అధికారులను హెచ్చరించారు. అజెండాను ముందుగా పంపిస్తే మంత్రులు అధ్యయనం చేసి చర్చల్లో పాల్గొనే వీలుంటుందని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని ఆదేశించారు.
రాష్ట్రంలో ఉన్నత విద్యను బలోపేతం చేసే దిశగా డీమ్డ్ యూనివర్సిటీలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో డీమ్డ్ యూనివర్సిటీల సంఖ్య తక్కువగా ఉందని, కనీసం 10 ఎకరాల విస్తీర్ణంతో నాణ్యమైన విద్యను అందించే సంస్థలను ప్రోత్సహించాలని సూచించారు. విద్యా ప్రమాణాలను పెంచుతూనే మరిన్ని యూనివర్సిటీలు అందుబాటులోకి వచ్చేలా నిబంధనలను సరళీకృతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాజకీయంగా అప్రమత్తత, పాలనాపరంగా పారదర్శకత, అభివృద్ధి పథకాల్లో వేగం.. ఈ మూడింటి కలయికతోనే రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా చంద్రబాబు మంత్రులకు తేల్చి చెప్పారు. ఒకవైపు సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూనే, మరోవైపు రాజకీయ కుట్రలను ఎదుర్కోవడంలో మంత్రులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

Latest