- కెమికల్ పరిశ్రమలో ఎగిసిపడ్డ మంటలు!
- కిలోమీటర్ల మేర కమ్ముకున్న దట్టమైన కార్బన్.
సంగారెడ్డి,మహా.
సంగారెడ్డి జిల్లా గడ్డపోచారం పారిశ్రామిక వాడలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించి తీవ్ర కలకలం రేపింది. స్థానిక న్యూట్రన్ మహాలక్ష్మి సాల్వెంట్ కెమికల్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే కర్మాగారమంతా వ్యాపించాయి. సాల్వెంట్ కెమికల్ డ్రమ్ములు వరుసగా పేలడంతో మంటల ఉధృతి ఆకాశాన్ని తాకింది. ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో చుట్టుపక్కల పరిశ్రమల కార్మికులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురై పరుగులు తీశారు.
పరిశ్రమలోని రసాయన ద్రావణాలు అంటుకోవడంతో మంటలు అదుపులోకి రావడం కష్టతరంగా మారింది. ప్రమాద తీవ్రతకు కిలోమీటర్ మేర దట్టమైన నల్లటి పొగ కమ్ముకోవడంతో సమీప ప్రాంతాల ప్రజలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పటాన్‌చెరు, జిన్నారం ప్రాంతాల నుంచి అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రసాయనాల వల్ల మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో, పక్కనే ఉన్న ఇతర పరిశ్రమలకు ఇవి సోకకుండా ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, సాల్వెంట్ కెమికల్ డ్రమ్ములు నిల్వ ఉంచిన ప్రాంతంలో ఘర్షణ లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకొని ఉండవచ్చని భావిస్తున్నారు. డ్రమ్ములు పేలడం వల్ల మంటల తీవ్రత రెట్టింపు కావడమే కాకుండా, పరిసర ప్రాంతాల్లో వేడి గాలులు వీస్తున్నాయి. అదృష్టవశాత్తూ కార్మికులు అప్రమత్తమై బయటకు రావడంతో ప్రాణనష్టం తప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధికారులు మంటలను అదుపు చేసేందుకు ఫోమ్ యంత్రాలను కూడా రంగంలోకి దించారు. పూర్తిస్థాయిలో మంటలు చల్లారిన తర్వాతే ఆస్తి నష్టం అంచనా వేయగలమని పారిశ్రామిక భద్రతా అధికారులు వెల్లడించారు.








