- ఏడుగురు సీనియర్లపై సస్పెన్షన్ వేటు.
వరంగల్, మహా.
కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో ర్యాగింగ్ భూతం మరోసారి పడగవిప్పింది. జూనియర్లపై అమానుషంగా వ్యవహరించిన ఏడుగురు ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ (మూడో సంవత్సరం) విద్యార్థులపై కళాశాల యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. ఈ ర్యాగింగ్ ఘటనకు బాధ్యులైన ఆ ఏడుగురు సీనియర్లను కాలేజీ హాస్టల్ నుంచి శాశ్వతంగా బహిష్కరించడంతో పాటు, కళాశాల నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి సంచలన నిర్ణయం తీసుకున్నారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇచ్చిన సమగ్ర నివేదిక ఆధారంగానే ఈ సస్పెన్షన్ వేటు వేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.
మార్చి 29వ తేదీన బాయ్స్ హాస్టల్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్న కొందరు సీనియర్లు.. సెకండ్ ఇయర్ విద్యార్థులను హాస్టల్ భవనం పైకి పిలిపించి తీవ్ర స్థాయి ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. జూనియర్లను అర్ధనగ్నంగా మార్చి, మోకాళ్లపై కూర్చోబెట్టి, వారితో బలవంతంగా గోడ కుర్చీ వేయించి పైశాచికానందం పొందారు. సీనియర్ల వేధింపులతో తీవ్ర మనోవేదనకు గురైన బాధితులు.. తమకు జరిగిన అన్యాయంపై నేరుగా మెడికల్ కౌన్సిల్‌తో పాటు సంబంధిత శాఖాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు వెంటనే యాంటీ ర్యాగింగ్ కమిటీ ద్వారా విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లాలోని మట్వాడ పోలీస్ స్టేషన్లో సైతం సదరు సీనియర్ విద్యార్థులపై క్రిమినల్ కేసు నమోదైంది. మరోవైపు యాంటీ ర్యాగింగ్ కమిటీ జరిపిన విచారణలో సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడిన మాట వాస్తవమేనని తేలడంతో, ఆ కమిటీ తన నివేదికను కళాశాల యాజమాన్యానికి అందజేసింది. నేరం రుజువు కావడంతో ఆ ఏడుగురు విద్యార్థులపై ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి క్రమశిక్షణా చర్యలు చేపట్టారు. క్యాంపస్‌లో ర్యాగింగ్‌ను ఏమాత్రం ఉపేక్షించేది లేదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు పాల్పడితే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని ఈ కఠిన చర్యల ద్వారా యాజమాన్యం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.








