Mahaa Daily Exclusive

  ముంబై ఎయిర్‌పోర్ట్‌లో భారీ గోల్డ్ స్మగ్లింగ్ గుట్టు రట్టు..

Share

  •  రూ.38 కోట్ల విలువైన 30 కిలోల బంగారం సీజ్, 24 మంది మహిళల అరెస్ట్.
  • నైరోబి నుంచి వచ్చిన మహిళా స్మగ్లర్ల ఆటకట్టించిన డీఆర్ఐ.

 

ఢిల్లీ, మహా.

దేశ ఆర్థిక వ్యవస్థకు గండికొట్టేలా సాగుతున్న ఓ భారీ అంతర్జాతీయ బంగారు స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను ముంబైలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘ఆపరేషన్ ధహబు బ్లిట్జ్’ పేరుతో నిర్వహించిన మెరుపు దాడుల్లో ఏకంగా రూ.37.74 కోట్ల విలువైన 29.37 కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. ఈ భారీ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న 24 మంది విదేశీ మహిళా క్యారియర్‌లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పక్కా ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు రంగంలోకి దిగిన డీఆర్ఐ ప్రత్యేక బృందాలు.. ఆఫ్రికా దేశమైన నైరోబి నుంచి ముంబైకి చేరుకున్న కొందరు ప్రయాణికుల కదలికలపై నిఘా ఉంచాయి. అనుమానాస్పదంగా ఉన్న ఆ విదేశీ మహిళలను అడ్డగించి క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఈ భారీ స్మగ్లింగ్ వ్యవహారం వెలుగుచూసింది. వారి వద్ద నుంచి మొత్తం 25.10 కిలోల బంగారు బిస్కెట్లు, అలాగే 4.27 కిలోల బరువైన బంగారు ఆభరణాలను అధికారులు రికవరీ చేశారు.

ఈ కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇదొక అత్యంత ప్రణాళికాబద్ధమైన మరియు వ్యవస్థీకృత స్మగ్లింగ్ సిండికేట్ అని డీఆర్ఐ అధికారులు గుర్తించారు. అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని దేశంలోకి తరలించేందుకు ఈ ముఠా.. ప్రత్యేక శిక్షణ పొందిన మహిళలను క్యారియర్లుగా వాడుకున్నట్లు తేలింది. ఇంతమంది ఒకేసారి పెద్ద ఎత్తున బంగారాన్ని తీసుకురావడం వెనుక ఉన్న ప్రధాన సూత్రధారుల కోసం డీఆర్ఐ ముమ్మరంగా గాలిస్తోంది. దేశ భద్రతకు, ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమించే ఇలాంటి స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లను సమూలంగా నాశనం చేసేందుకు తమ దాడులు నిరంతరం కొనసాగుతాయని డీఆర్ఐ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

Latest