- బీఆర్ఎస్లో సీనియర్ల పరిస్థితేంటి?
- జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఎదురుదాడి.
- నరేంద్ర, ఈటల ఎందుకు బయటకు వచ్చారో చెప్పాలని నిలదీత.
ఢిల్లీ, మహా.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు అన్యాయం జరుగుతోందంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దీటైన బదులిచ్చారు. న్యూఢిల్లీ వేదికగా మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. జీవన్ రెడ్డి విమర్శలను కొట్టిపారేస్తూనే, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీనియర్ నేతలకు ఎదురైన పరాభవాలను గుర్తుచేస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనపై జీవన్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని, వాటిపై తాను ప్రత్యేకంగా స్పందించబోనని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు.
కాంగ్రెస్‌లో సీనియర్లకు అవమానం జరుగుతోందని ఆరోపిస్తున్న వారు, ముందుగా బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్) వ్యవహార శైలిని ఆత్మవిమర్శ చేసుకోవాలని రేవంత్ రెడ్డి హితవు పలికారు. ఒకప్పుడు పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన ఆళ్ల నరేంద్ర, విజయశాంతి, ఈటల రాజేందర్ లాంటి ఉద్దండులు బీఆర్ఎస్ను ఎందుకు వీడాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అక్కడ ఆ సీనియర్ నేతలకు జరిగిన అవమానాలు, వారు ఎదుర్కొన్న చేదు అనుభవాలు రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితమేనని ఆయన గుర్తుచేశారు.
అంతేకాకుండా, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రస్తుత పరిస్థితిని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాంగ్రెస్‌ను వీడి గులాబీ గూటికి చేరిన తర్వాత పొన్నాల ఇప్పుడు ఎక్కడున్నారో, ఆయనకు బీఆర్ఎస్లో దక్కిన గౌరవం ఏపాటిదో అందరికీ కనిపిస్తూనే ఉందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో సీనియర్లకు జరిగిన అవమానాలు ఇంత త్వరగా మర్చిపోయారా? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ తమ నాయకులకు సముచిత స్థానం కల్పిస్తూ గౌరవిస్తుందని, అయితే కొందరు కావాలని చేస్తున్న రాజకీయ విమర్శలకు కాలమే సరైన సమాధానం చెబుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.








