హైదరాబాద్, మహా.
తనపై వచ్చిన భారీ ఆర్థిక నేరారోపణలు , కుంభకోణాల వార్తలపై ప్రముఖ జానపద గాయని మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా, అబద్ధపు ఆరోపణలతో తనను ఇరికించేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ ఆమె చట్టపరమైన పోరాటానికి దిగారు. తనపై గతంలో ఫిర్యాదు చేసిన వారిపైనే తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. శనివారం నార్సింగి పోలీస్ స్టేషన్లో తన తరపు న్యాయవాదులతో కలిసి హాజరైన మంగ్లీ, సుభా సింగబోష్ అనే వ్యక్తి తనను తీవ్రంగా వేధిస్తున్నాడని, తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మంగ్లీ ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. గత మార్చి 21వ తేదీన సుభా సింగబోష్ అనే వ్యక్తి తనకు పరిచయం చేసుకున్నాడని, అప్పటి నుంచి తనను మానసికంగా వేధిస్తున్నాడని ఆమె ఆరోపించారు. తనను కలవాలని, లేనిపక్షంలో సమాజంలో తనకున్న గౌరవ మర్యాదలను మంటగలుపుతానని అతడు బహిరంగంగా బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె పేర్కొన్నారు. తనకు ఏమాత్రం సంబంధం లేని ఒక వ్యవహారంలో తన పేరును కావాలని లాగి, సుమారు 150 కోట్ల రూపాయల మేర ఆర్థిక మోసం చేశానంటూ సదరు వ్యక్తి తప్పుడు ప్రచారం చేశాడని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశంతోనే ఇలాంటి అభూతకల్పనలు సృష్టించారని, తన ఎదుగుదలను ఓర్వలేక కొందరు శక్తులు ఇతని వెనుక ఉండి నడిపిస్తున్నాయని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై మానవీయ కోణంలో స్పందించిన మంగ్లీ.. ఒక కళాకారిణిగా ఎంతో కష్టపడి సంపాదించుకున్న గుర్తింపును ఇలాంటి చౌకబారు ఆరోపణలతో దెబ్బతీయడం అత్యంత బాధాకరమని అన్నారు. చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, తనను ఇబ్బంది పెడుతున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మంగ్లీ ఫిర్యాదును స్వీకరించిన నార్సింగి పోలీసులు నిందితుడు సుభా సింగబోష్పై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని సెక్షన్ 79 (మహిళా గౌరవానికి భంగం కలిగించడం) , 351(3) (నేరపూరితమైన బెదిరింపులు) కింద కేసు నమోదు చేశారు.







