Mahaa Daily Exclusive

  10 ట్రిలియన్ల కల..! న్యాయవ్యవస్థే అసలు బలం..

Share

  •  ‘రూల్ ఆఫ్ లా’ సదస్సులో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ దిశానిర్దేశం!

ఢిల్లీ, మహా.

భారతదేశం పది ట్రిలియన్ డాలర్ల ఆర్థిక మహాశక్తిగా అవతరించాలన్న లక్ష్యం కేవలం కాగితాల మీద రాసుకున్న విధానాల వల్లనో, విదేశీ పెట్టుబడుల ప్రవాహం వల్లనో సాధ్యం కాదని, ఆ పునాదులను పటిష్టం చేసేది నిఖార్సైన న్యాయవ్యవస్థేనని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కుండబద్ధలు కొట్టారు. శనివారం రాజధానిలో జరిగిన ‘రూల్ ఆఫ్ లా కన్వెన్షన్ 2026’లో ఆయన ప్రసంగిస్తూ, దేశ ఆర్థిక భవిష్యత్తుకు మరియు న్యాయవ్యవస్థ నాణ్యతకు మధ్య ఉన్న విడదీయలేని బంధాన్ని విశ్లేషించారు. “లీగల్ రిఫార్మ్ రోడ్‌మ్యాప్ టు ఎ యూఎస్‌డీ 10 ట్రిలియన్ భారత్” అనే ఇతివృత్తంపై జరిగిన ఈ సమావేశంలో ఆయన వినిపించిన వాదనలు పెట్టుబడిదారులు, న్యాయకోవిదులు మరియు పారిశ్రామిక వర్గాల్లో కొత్త ఆలోచనలకు దారితీశాయి. ఒక దేశం ఆర్థికంగా ఎంత బలంగా ఉందనేది ఆ దేశంలోని కోర్టులు ఎంత వేగంగా, పారదర్శకంగా న్యాయం అందిస్తాయనే దానిపైనే ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

పెట్టుబడుల ఆకర్షణ , న్యాయపరమైన భద్రత గురించి మాట్లాడుతూ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లు కేవలం లాభాలను మాత్రమే చూడరని, తమ పెట్టుబడికి చట్టపరమైన రక్షణ ఉందా లేదా అని ఆరా తీస్తారని సీజేఐ పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాలలో వ్యాపార వివాదాల తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయని ఆయన విశ్లేషించారు. అప్పట్లో చెల్లింపులు ఆగిపోవడమో, చిన్నపాటి ఒప్పంద ఉల్లంఘనల వంటి సరళమైన అంశాలే కోర్టుల ముందుకు వచ్చేవి. కానీ నేడు ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ భాగస్వామ్యాలు, సంక్లిష్టమైన దీర్ఘకాలిక ఒప్పందాలు పెరిగాయని, వీటిని పరిష్కరించడానికి పాత కాలపు పద్ధతులు సరిపోవని ఆయన అభిప్రాయపడ్డారు. చట్టాలను పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదని, కానీ అవి మారుతున్న సమాజ అవసరాలకు, వ్యాపార రీతులకు అనుగుణంగా పరిణామం చెందాలని సూచించారు.

దేశ ఆర్థికాభివృద్ధికి మూడు ముఖ్యమైన స్తంభాలను జస్టిస్ సూర్యకాంత్ ఈ సందర్భంగా ప్రతిపాదించారు. మొదటిది ‘ప్రెడిక్టబిలిటీ’—అంటే ప్రభుత్వాలు మారినా, పరిస్థితులు మారినా చట్టం అమలులో స్థిరత్వం ఉండాలి. చట్టం ఏం చెబుతుందో, తీర్పు ఎలా వస్తుందో ముందే ఊహించగలిగే వాతావరణం ఉన్నప్పుడే వ్యాపారాలు వృద్ధి చెందుతాయని వివరించారు. రెండో అంశంగా వివాదాలను ముందుగానే నివారించే సంస్కృతిని ప్రస్తావించారు. ప్రతి చిన్న విషయాన్ని కోర్టు వరకు తీసుకురాకుండా, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని, లిటిగేషన్ అనేది మొదటి ఎంపిక కాకుండా చివరి మార్గంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇక మూడోది ‘స్పెషలైజేషన్’. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్స్, డిజిటల్ టెక్నాలజీ వంటి ప్రత్యేక రంగాల్లో వచ్చే వివాదాలను పరిష్కరించడానికి న్యాయమూర్తులు , న్యాయవాదులకు ప్రత్యేక నైపుణ్యం మరియు శిక్షణ అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.

సాంకేతికత మరియు న్యాయ విద్యలో సంస్కరణల గురించి మాట్లాడుతూ, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా న్యాయ విద్యార్థులను తయారు చేయాల్సిన బాధ్యత మనపై ఉందని సీజేఐ గుర్తు చేశారు. డిజిటల్ కేస్ మేనేజ్‌మెంట్, ఏఐ ఆధారిత పరిశోధన సాధనాలు న్యాయ ప్రక్రియను వేగవంతం చేస్తాయని, అయితే ఎంతటి టెక్నాలజీ వచ్చినా తుది నిర్ణయంలో మానవ వివేచన మరియు తీర్పే ప్రధానమని స్పష్టం చేశారు. బార్ మరియు బెంచ్ సమన్వయంతో పనిచేస్తేనే బలమైన కమర్షియల్ న్యాయవ్యవస్థ నిర్మాణం సాధ్యమవుతుందని, దేశాన్ని 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే ఈ చారిత్రాత్మక ప్రయాణంలో న్యాయవాదులు కేవలం సేవకులుగా కాకుండా బాధ్యతాయుత భాగస్వాములుగా వ్యవహరించాలని ఆయన ఆకాంక్షించారు.