- ఐసీయూలో ఆశా భోస్లేకు అత్యవసర చికిత్స.
- విషమంగా దిగ్గజ గాయని ఆరోగ్య పరిస్థితి.
ముంబై, మహా.
భారతీయ సంగీత సామ్రాజ్యాన్ని తన అద్భుతమైన స్వరంతో ఏలుతున్న దిగ్గజ గాయని, పద్మవిభూషణ్ ఆశా భోస్లే (92) ఆకస్మిక అస్వస్థతకు గురయ్యారు. శనివారం మధ్యాహ్నం ముంబైలోని తన నివాసంలో ఉండగా ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు తక్షణమే స్పందించి ముంబైలోని ప్రముఖ బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న సమయానికే ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో, వైద్యులు ఏమాత్రం జాప్యం చేయకుండా ఆమెను అత్యవసర చికిత్సా విభాగం లోకి తరలించి చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని, వైద్యుల బృందం ఆమెను నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలుస్తోంది. గాన కోకిల అనారోగ్య వార్త తెలిసిన వెంటనే యావత్ సినిమా పరిశ్రమతో పాటు కోట్లాది మంది అభిమానులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.ఆశా భోస్లే వయస్సు రీత్యా గుండెపోటు తీవ్రతను ఎదుర్కోవడం వైద్యులకు పెద్ద సవాలుగా మారింది. బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలోని అగ్రశ్రేణి కార్డియాలజిస్టుల బృందం ఆమెకు చికిత్స అందిస్తోంది. ప్రస్తుతం ఆమెను కృత్రిమ శ్వాసక్రియ పై ఉంచినట్లు సమాచారం అందుతోంది. గత కొద్దికాలంగా వయస్సు సంబంధిత సమస్యలతో ఆమె ఇబ్బంది పడుతున్నప్పటికీ, ఇటీవల వరకు ఎంతో ఉత్సాహంగా సంగీత కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవారు. అయితే, ఈ హఠాత్పరిణామం వైద్య వర్గాల్లో సైతం ఆందోళన కలిగిస్తోంది. వచ్చే 24 నుంచి 48 గంటలు ఆమె ప్రాణాలకు అత్యంత కీలకమని, శరీర స్పందనలను బట్టి తదుపరి చికిత్సను నిర్ణయిస్తామని వైద్యులు వెల్లడించారు. ఆసుపత్రి వర్గాల నుంచి ఎప్పటికప్పుడు బులెటిన్లను ఆశిస్తున్న అభిమానులు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. భారతీయ సామాజిక జీవనంలో ఒక భాగం. ఎనిమిది దశాబ్దాలకు పైగా సాగిన ఆమె ప్రస్థానంలో వేల సంఖ్యలో గీతాలను ఆలపించి, తరతరాల వారికి సంగీత జ్ఞానాన్ని పంచారు. తన గాత్రంతో ఎందరికో ఆశను, ఊరటను ప్రసాదించిన ఆమె, నేడు మృత్యువుతో పోరాడుతుండటం హృదయవిదారకం. ఆమె గొంతు మళ్లీ మ్రోగాలని, ఆ మధుర స్వరం దేశాన్ని మళ్లీ పులకింపజేయాలని సంగీత దర్శకులు, గాయనీగాయకులు , సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. ఆసుపత్రి పరిసరాల్లో ఆమె కుటుంబ సభ్యులు, మనుమలు, మనుమరాళ్లు విషణ్ణ వదనాలతో కనిపిస్తుండటం అక్కడి వాతావరణాన్ని మరింత గంభీరంగా మార్చేసింది.
ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి వెలుపల అభిమానుల రద్దీ పెరుగుతుండటంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ తారలు ఆసుపత్రికి చేరుకుని ఆమె ఆరోగ్య పరిస్థితిని ఆరా తీస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రేమికులు ఆమె క్షేమంగా తిరిగి రావాలని ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.







