- సామాజిక తెలంగాణే పార్టీ ఎజెండా.
- ఏప్రిల్ 25న పార్టీ ఆవిర్భావం.
- జెండాపై ‘నీలి’ ముద్ర ఖాయం.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర రాజకీయ యవనికపై తనదైన ముద్ర వేసేందుకు కల్వకుంట్ల కవిత సిద్ధమవుతున్నారు. తాను ఏర్పాటు చేయబోయే నూతన రాజకీయ పార్టీ రూపరేఖలకు సంబంధించి అత్యంత కీలకమైన అంశాన్ని ఆమె శనివారం సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కొత్త పార్టీ జెండా మరియు ఎజెండాలో ‘నీలిరంగు’ ప్రధాన భూమిక పోషించబోతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. కేవలం రంగుగానే కాకుండా, తమ పార్టీకి ఉండబోయే స్పష్టమైన విజన్‌కు, మాట ఇస్తే కట్టుబడి ఉండే నమ్మకత్వానికి ఈ నీలిరంగు సంకేతమని ఆమె వివరించారు. ‘కలర్ థియరీ’ అనే హాష్ ట్యాగ్‌తో ఆమె చేసిన ఈ పోస్ట్, రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించబోయే సామాజిక గమనాన్ని సూచిస్తోంది. అట్టడుగు వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తన రాజకీయ ప్రయాణం సాగబోతోందని ఈ నిర్ణయం ద్వారా ఆమె పరోక్షంగా వెల్లడించారు. కవిత తన పార్టీకి రంగుల ఎంపిక విషయంలో ఎంతో లోతైన అధ్యయనం చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు ఆమె నేతృత్వం వహించిన ‘తెలంగాణ జాగృతి’ సంస్థలోని ఆకుపచ్చ రంగు పచ్చదనానికి, వ్యవసాయానికి , రైతు సంక్షేమానికి నిదర్శనంగా ఉండేది. ఇప్పుడు కొత్తగా చేరబోయే నీలిరంగు బడుగు, బలహీన వర్గాల వికాసానికి, వారి సామాజిక సమున్నతికి సూచిక అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే, రైతాంగంతో పాటు బహుజన వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి, ఒక సమగ్ర సామాజిక తెలంగాణను నిర్మించడమే తన లక్ష్యమని ఆమె చాటుకుంటున్నారు. ‘సామాజిక తెలంగాణ – సర్వోదయ వికాసం’ అనే నినాదంతో, ‘తెలంగాణ ఫస్ట్’ సిద్ధాంతాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆమె ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
పార్టీ ఆవిర్భావం , ఏర్పాట్ల విషయంలో కవిత బృందం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఈ నెల 25వ తేదీన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వేషన్ వేదికగా ఈ నూతన రాజకీయ శక్తి ఆవిర్భవించబోతోంది. శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా నిజామాబాద్‌లో ఆమె చేసిన ప్రకటన ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. ప్రస్తుతం వివిధ రంగాల ప్రముఖులు, మేధావులు మరియు సామాజిక కార్యకర్తలతో ఆమె వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ పేరు, విధివిధానాలు , భవిష్యత్ కార్యాచరణను ఆవిర్భావ సభ రోజే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తన రాజకీయ పునరాగమనాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కవిత, ఈ పార్టీ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో ఏ విధమైన మార్పులు తీసుకువస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కవిత ఏర్పాటు చేయబోయే పార్టీ రాష్ట్రంలోని ఇతర పార్టీలకు గట్టి పోటీనిచ్చేలా కనిపిస్తోంది. ముఖ్యంగా బలహీన వర్గాల ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని ‘నీలిరంగు’ను ఎంచుకోవడం వెనుక బలమైన రాజకీయ చతురత దాగి ఉంది. జెండాలో పచ్చదనం , నీలిమ కలయిక వల్ల రైతులు, వెనుకబడిన తరగతుల సమ్మేళనంగా పార్టీ రూపుదిద్దుకోనుంది. ఏప్రిల్ 25న జరగబోయే ఈ ఆవిర్భావ వేడుక తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుందని జాగృతి వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రాజధాని నగరం పొలిమేరల్లో జరగబోయే ఈ భారీ బహిరంగ సభ ద్వారా తన రాజకీయ సత్తాను చాటిచెప్పేందుకు కవిత సర్వం సిద్ధం చేసుకున్నారు.







