Mahaa Daily Exclusive

  ఆర్ఎస్ఎస్ ఎవరికీ వ్యతిరేకం కాదు.. హిందూ సమాజాన్ని ఏకం చేసే సాధనం..

Share

  • హిందూ సమాజాన్ని ఏకం చేసే సాధనం.
  • హెడ్గేవార్ ఒక మహోన్నతమైన ఆలోచనా విధానం.
  • కందకుర్తి దేశభక్తిని నేర్పే పాఠశాల.
  •  సమాజంలో సమరసత నెలకొన్నప్పుడే.. అజేయమైన శక్తిగా భారతదేశం.
  • సంఘ్ అధినేత (సరసంఘచాలక్) డాక్టర్ మోహన్ భాగవత్.

 

హైదరాబాద్, మహా.

 

**జాతీయవాదమే శ్వాసగా, సమాజ నిర్మాణమే ధ్యేయంగా వందేళ్ల క్రితం మొలకెత్తిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాల వేళ.. ఆ మహా వృక్షానికి బీజం వేసిన డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ మూలాలైన కందకుర్తిలో సరికొత్త జాతీయ స్ఫూర్తి రగులుకుంది. గోదావరి, మంజీర, హరిద్ర నదుల పవిత్ర త్రివేణి సంగమ క్షేత్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘శ్రీ కేశవ స్ఫూర్తి మందిరాన్ని’ సంఘ్ అధినేత (సరసంఘచాలక్) డాక్టర్ మోహన్ భాగవత్ శనివారం జాతికి అంకితం చేశారు. ఆర్ఎస్ఎస్ ఏ ఒక్కరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన ఆయన.. హెడ్గేవార్ కేవలం ఒక వ్యక్తి కాదని, దేశాన్ని అజేయ శక్తిగా నిలబెట్టే ఓ మహోన్నత ఆలోచనా విధానమని ఉద్ఘాటించారు. దేశభక్తిని నూరిపోసే పాఠశాలగా మారనున్న కందకుర్తి వేదికగా సమాజంలో సమరసత ఆవశ్యకతను ఆయన కుండబద్ధలు కొట్టారు**

 

నిజామాబాద్ జిల్లాలోని త్రివేణి సంగమ క్షేత్రం కందకుర్తి ఒక మహాద్భుత చారిత్రక ఘట్టానికి సాక్షీభూతంగా నిలిచింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాల వేళ, ఆ మహా వృక్షానికి బీజం వేసిన వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ పూర్వీకుల పవిత్ర గడ్డపై నిర్మించిన ‘శ్రీ కేశవ స్ఫూర్తి మందిరం’ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. దశాబ్దాల కాలంగా వేలాది మంది సంఘ్ కార్యకర్తలు కన్న కల నేడు వాస్తవరూపం దాల్చడంతో కందకుర్తి పరిసర ప్రాంతాలన్నీ కాషాయ ధ్వజాల నీడన జాతీయ భావంతో ప్రతిధ్వనించాయి. అత్యంత భక్తిశ్రద్ధలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆర్ఎస్ఎస్ సరసంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ఈ స్ఫూర్తి కేంద్రాన్ని స్వయంగా ప్రారంభించి యావత్ జాతికి అంకితం చేశారు. తన వ్యవస్థాపకుడి మూలాలను స్మరించుకుంటూ, భావి తరాలకు జాతీయ స్ఫూర్తిని, క్రమశిక్షణను అందించే లక్ష్యంతో నిర్మించిన ఈ కేంద్రం కేవలం ఒక భౌతిక కట్టడం మాత్రమే కాదని, ప్రతి భారత పౌరుడిలో దేశభక్తిని నింపే ఒక అఖండ శక్తి కేంద్రమని ఆయన అభివర్ణించారు.

ఈ బృహత్తర కార్యక్రమం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో ప్రారంభమైంది. నూతనంగా నిర్మించిన స్ఫూర్తి కేంద్రంలో మోహన్ భాగవత్ తొలుత డాక్టర్ హెడ్గేవార్ విగ్రహాన్ని, అనంతరం భరతమాత విగ్రహాన్ని ఆవిష్కరించి, పుష్పమాలలు సమర్పించి అత్యంత భక్తిప్రపత్తులతో ప్రణామం చేశారు. అనంతరం స్ఫూర్తి కేంద్రం లోపల ఏర్పాటు చేసిన అరుదైన ఫొటో గ్యాలరీని ఆయన ఎంతో ఆసక్తిగా, తదేకంగా పరిశీలించారు. హెడ్గేవార్ జీవిత ప్రయాణం, సంఘ్ ఆవిర్భావ నేపథ్యం, దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ఆయన పోషించిన అనితర సాధ్యమైన పాత్రను కళ్లకు కట్టేలా తీర్చిదిద్దిన ఛాయాచిత్రాలను చూస్తూ గతాన్ని స్మరించుకున్నారు. సందర్శకుల పుస్తకంలో తన అమూల్యమైన సందేశాన్ని లిఖిస్తూ, కందకుర్తి యావత్ దేశానికి ఒక దిక్సూచిగా మారాలని ఆకాంక్షించారు. ఈ మహత్తర కార్యక్రమంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి, నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ శాసనసభ్యులు రాకేష్ రెడ్డితో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయి ఆర్ఎస్ఎస్ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొని జాతీయవాద భావజాలాన్ని చాటిచెప్పారు.

అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోహన్ భాగవత్ చేసిన ఉద్వేగభరిత ప్రసంగం ప్రతీ ఒక్కరిలోనూ దేశభక్తి జ్వాలను రగిలించింది. డాక్టర్ హెడ్గేవార్ జీవితాన్ని కేవలం ఒక సంస్థ పరిధిలో బంధించి చూడటం ఏమాత్రం తగదని, ఆయన భరతమాత విముక్తి కోసం కాంగ్రెస్ నాయకుడిగా, అజ్ఞాత విప్లవకారుడిగా బహుముఖ పాత్రలు పోషించిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడని గుర్తు చేశారు. ఆయన జన్మించింది మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అయినప్పటికీ, ఆయన సిరల్లో ప్రవహించిన రక్తంలో తెలంగాణ నేల వాసన, కందకుర్తి సాంస్కృతిక వారసత్వం ఇమిడి ఉన్నాయని, అందుకే ఈ గడ్డకు అంతటి మహత్యం చేకూరిందని వ్యాఖ్యానించారు. హెడ్గేవార్ కేవలం ఒక సాధారణ వ్యక్తి కాదని, ఆయన ఒక గొప్ప ఆలోచనా స్రవంతి అని, హిందూ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి తన జీవితాన్ని గంధపు చెక్కలా అరిగించిన మహాత్ముడని ప్రశంసించారు. కులమతాలకు, అంతరాలకు అతీతంగా ప్రతి భారతీయుడు ఒకే తల్లి బిడ్డగా మెలగాలని, సమాజంలో సంపూర్ణ సమరసత నెలకొన్నప్పుడే మన దేశం ప్రపంచ పటంలో అజేయమైన శక్తిగా అవతరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

సంఘం ఆవిర్భావం వెనుక ఉన్న అసలైన ఉద్దేశాలను, సిద్ధాంతాలను భాగవత్ తన ప్రసంగంలో మరోసారి కుండబద్ధలు కొట్టారు. ఆర్ఎస్ఎస్ ఎవరికీ వ్యతిరేకంగా ఏర్పడిన సంస్థ కాదని, ఇది కేవలం హిందూ సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చి, దేశాన్ని పునరుజ్జీవింపజేసే ఒక పవిత్ర సాధనమని ఆయన పునరుద్ఘాటించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా, నేటికీ సామాజిక సమరసత అత్యంత ఆవశ్యకమని, సంకుచిత స్వార్థ రాజకీయాలకు అతీతంగా జాతీయ ప్రయోజనాలే పరమావధిగా భావించాలని పిలుపునిచ్చారు. సుమారు పది కోట్ల రూపాయల భారీ వ్యయంతో రెండంతస్తుల్లో నిర్మించిన ఈ కేంద్రంలో అధునాతన మ్యూజియంతో పాటు వీడియో ప్రజెంటేషన్ హాల్ ఉండటం వల్ల సందర్శకులకు హెడ్గేవార్ జీవిత విశేషాలు సులభంగా అర్థమవుతాయని వివరించారు. ఈ క్షేత్రాన్ని ప్రతి భారతీయుడు సందర్శించి ఇక్కడి నుంచి స్ఫూర్తిని పొందాలని, ఇది కేవలం విహారయాత్ర కోసం వచ్చే పర్యాటక స్థలం కాదని, దేశభక్తిని నేర్పే గొప్ప పాఠశాల అని ఆయన అభివర్ణించారు.

సభకు ముందు పురాతన కేశవ మూర్తి, విఠలేశ్వర ఆలయాలను భాగవత్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా ఈ ప్రాంత ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కూడా నొక్కి చెప్పారు. కందకుర్తి పవిత్ర త్రివేణి సంగమం కావడంతో, ఇక్కడ స్ఫూర్తి కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్తులో భక్తులకు, లక్షలాది మంది స్వయంసేవకులకు ఇది ఒక పవిత్ర తీర్థయాత్ర క్షేత్రంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తన వందేళ్ల చారిత్రక ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న తరుణంలో, వ్యవస్థాపకుడి మూలాల వద్ద ఇలాంటి భారీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం ద్వారా సమాజానికి ఒక స్పష్టమైన, బలమైన సందేశాన్ని పంపారు. డాక్టర్ హెడ్గేవార్ ఆశయాలకు అనుగుణంగా ప్రధాని మోదీ కలలుగంటున్న ‘వికసిత భారత్’ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావడమే ఆ మహానేతకు మనం ఇచ్చే అసలైన నివాళి అని సభను ముగించారు.