- జామ్‌నగర్ వేదికగా ‘వంతారా’ వర్సిటీకి అంకురార్పణ.
- ప్రపంచంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ వైల్డ్‌లైఫ్ – వెటర్నరీ విశ్వవిద్యాలయం.
- ప్రకృతి సేవలో తలమునకలవుదాం.. అనంత్ అంబానీ పిలుపు.
జామ్‌నగర్,మహా.
భారతీయ ఆధ్యాత్మికతను, ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని మేళవిస్తూ.. వన్యప్రాణుల సంరక్షణలో సరికొత్త సువర్ణాధ్యాయానికి అనంత్ అంబానీ నాంది పలికారు. గుజరాత్‌లోని జామ్‌నగర్ వేదికగా, ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా వన్యప్రాణుల సంరక్షణ , పశువైద్య శాస్త్రాల కలయికతో రూపుదిద్దుకుంటున్న ‘వంతారా యూనివర్సిటీ’కి ఆయన వైభవంగా శంకుస్థాపన చేశారు. ఇది కేవలం ఒక విద్యాసంస్థ మాత్రమే కాదని, రాబోయే వేల సంవత్సరాల పాటు ప్రకృతి మాతకు, సకల జీవరాశికి సేవ చేసే ఒక నిరంతర ‘వారసత్వ యజ్ఞం’ అని ఆయన అభివర్ణించారు.
**మానవాళి ఆరోగ్యానికీ శ్రీరామరక్ష**
శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన సభలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. “వంతారా విశ్వవిద్యాలయం వన్యప్రాణి రంగంలో రేపటి ‘దిగ్గజాలను’ సృష్టించబోతోంది. ఇది ప్రపంచంలోనే అత్యంత డైనమిక్ మరియు అత్యాధునిక పరిశోధనల నిలయంగా మారుతుంది. ఈ వర్సిటీ కేవలం జంతువులకే పరిమితం కాదు.. మూగజీవాలకు సోకే వ్యాధులను గుర్తించి, వాటికి పరిష్కారాలు కనుగొనడం ద్వారా పరోక్షంగా మానవాళిని పట్టిపీడించే అనేక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించనుంది. వన్యప్రాణుల సంక్షేమమే లక్ష్యంగా వేల ఏళ్ల పాటు నిలిచిపోయే ఒక గొప్ప వ్యవస్థను మేము నిర్మిస్తున్నాం” అని ఆయన స్పష్టం చేశారు.
**ప్రపంచానికి దిక్సూచిలా భారత శాస్త్రవేత్తలు**
భారతదేశం నుంచి ప్రపంచ స్థాయి మేధావులను పంపడమే వంతారా లక్ష్యమని అనంత్ పేర్కొన్నారు. “ప్రతి ఏటా ఈ విశ్వవిద్యాలయం అగ్రశ్రేణి పశువైద్యులను, నిష్ణాతులైన శాస్త్రవేత్తలను యావత్ ప్రపంచానికి అందిస్తుంది. వన్యప్రాణుల రక్షణ, చికిత్స మరియు పునరావాసంలో ఇక్కడ జరిగే శాస్త్రీయ పరిశోధనలు అంతర్జాతీయ స్థాయిలో ప్రామాణికంగా నిలుస్తాయి. ప్రకృతిని, సృష్టిని రక్షించాలనే తపన ఉన్న ప్రతి ఒక్కరికీ వంతారా ఒక పవిత్ర గమ్యస్థానంగా మారుతుంది” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
**హిందూ జీవన తత్వమే పునాది**
జామ్‌నగర్‌లోని 3,500 ఎకరాల సువిశాల హరిత ప్రాంతంలో ఈ విశ్వవిద్యాలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. భారతీయ సంప్రదాయం ప్రకారం, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పవిత్ర మట్టి, జలాలతో శంకుస్థాపన నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా అనంత్ అంబానీ మాట్లాడుతూ.. “హిందూ సంస్కృతిలో ప్రతి ప్రాణి ఒక విశిష్టమైన ఉద్దేశంతోనే జన్మిస్తుంది. సకల జీవరాశి భగవంతుడి స్వరూపమని, ప్రకృతి దైవదత్తమని మనం నమ్ముతాం. ఈ సృష్టిని రక్షించడమే మన అసలైన ధర్మం. నా తల్లిదండ్రులు ముఖేష్ అంబానీ, నీతా అంబానీలు అందించిన స్ఫూర్తితో, మన దేశం గర్వపడేలా ఈ ప్రాజెక్టును ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం” అని ప్రకటించారు.
**పుట్టినరోజు కానుకగా బృహత్ ప్రాజెక్టు**
ఏప్రిల్ 10న తన 31వ పుట్టినరోజు సందర్భంగా అనంత్ అంబానీ ఈ చారిత్రాత్మక ప్రకటన చేశారు. వంతారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందగా, ఇప్పుడు దానికి తోడుగా ఒక సమగ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు కావడం విశేషం. వన్యప్రాణి సంరక్షణలో అత్యాధునిక సాంకేతికతను జోడించి, జంతువుల ఆరోగ్యమే పరమావధిగా పనిచేసే ఈ వర్సిటీ.. రాబోయే రోజుల్లో భారత గడ్డపై మరో అద్భుత మైలురాయిగా నిలవబోతోంది.








