- కోటా పేరుతో రైతుల గొంతు కోయొద్దు.
- సదాశివపేట కొనుగోలు కేంద్రంలో అధికారులను నిలదీసిన హరీశ్ రావు.
సంగారెడ్డి,మహా.
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు కొనుగోలు కేంద్రాల వద్ద వారం రోజులుగా కన్నీరుమున్నీరవుతుంటే, ముఖ్యమంత్రి మరియు మంత్రులు మాత్రం గాలి మోటార్లలో విహరిస్తూ రైతుల కష్టాలను గాలికొదిలేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని రైతు సేవా కేంద్రంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన, అక్కడి దుస్థితిని చూసి చలించిపోయారు. కోటా అయిపోయిందన్న సాకుతో కొనుగోళ్లు నిలిపివేయడంతో నిరీక్షిస్తున్న రైతుల గోడును విన్న హరీశ్ రావు, తక్షణమే కొనుగోళ్లు ప్రారంభించాలని అధికారులను నిలదీశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా పడిగాపులు కాస్తున్న రైతులకు అండగా ఉండాల్సింది పోయి, ఇప్పటికే కొనుగోలు చేసిన శనగలను కూడా బిల్లులు కావడం లేదంటూ తిరిగి రైతులకే ఇచ్చేయడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. శనగలకు క్వింటాల్ కు 5,870 రూపాయల మద్దతు ధర ఉన్నప్పటికీ, ప్రభుత్వ కేంద్రాలు మూతపడటంతో దళారులు తక్కువ ధరకే కొంటున్నారని, దీనివల్ల రైతులకు ఎకరానికి పది వేల రూపాయల వరకు నష్టం వాటిల్లుతోందని గణాంకాలతో వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 60 వేల క్వింటాళ్ల శనగలు రైతుల వద్దే ఉన్నాయని, వాటిని వెంటనే సేకరించాలని డిమాండ్ చేశారు.
కేవలం శనగలే కాకుండా మక్కజొన్న, జొన్నలు పండించిన రైతుల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదని హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రంలో 11 లక్షల ఎకరాల్లో మక్కజొన్న సాగు జరిగితే, సగం కేంద్రాలు కూడా తెరవలేదని, రూ. 2,400 మద్దతు ధర ఉండగా రైతులు రూ. 1,600లకే అమ్ముకుని నష్టపోతున్నారని పేర్కొన్నారు. జొన్నల కొనుగోలుపై ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయమే తీసుకోకపోవడం వల్ల అన్నదాతలు పక్క రాష్ట్రాలకు వెళ్లి సగం ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఎన్నికలకు ముందు ప్రతి పంటకూ బోనస్ ఇస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్, ఇప్పుడు ఆ మాటను పూర్తిగా బోగస్ చేసిందని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రికి ఢిల్లీ, కేరళ పర్యటనల మీద ఉన్న శ్రద్ధ గరీబ్ రైతుల మీద లేదని, భూములు, కాంట్రాక్టులు, కమిషన్ల మీద రివ్యూలు చేస్తారు తప్ప అన్నదాతల కష్టాలపై సమీక్ష చేసే తీరిక లేదని విమర్శించారు. పొలాలకు సరిగ్గా కరెంటు ఇవ్వడం లేదని, రైతుబంధు ఊసే లేదని, పండిన పంటను మద్దతు ధరకు కొనడం లేదని రైతులు వాపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం తన మొద్దునిద్ర వీడి తక్షణమే అన్ని పంటల కొనుగోలు కేంద్రాలను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని, ప్రతి గింజనూ మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సహా పలువురు నేతలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.








