గత మూడు దశాబ్దాలుగా అక్షరాన్ని నమ్ముకుని, వార్తా ప్రపంచపు లోతుపాతులను.. మరీ ముఖ్యంగా మన పల్లెల్లో, పట్టణాల్లో సామాన్యుడి ఎన్నికల నాడిని అత్యంత నిశితంగా గమనిస్తున్న కళ్ళకు, నేడు సమాచార వ్యవస్థలో జరుగుతున్న ఈ నిశ్శబ్ద విధ్వంసం గుండెను కలచివేస్తోంది. ఒకప్పుడు ప్రజాస్వామ్యం అంటే పల్లె రచ్చబండ మీద జరిగే స్వచ్ఛమైన చర్చ. మండుటెండల్లో నాయకుడు ప్రజలతో మమేకమైతే, ఆ చెమట చుక్కల్లో, ఆ చేతల వెనుక ఉన్న నిజాయితీని బట్టి ఓటరు తన తీర్పును రాసేవాడు. కానీ నేడు పరిస్థితి తలకిందులైంది. వాస్తవానికి, అబద్ధానికి మధ్య ఉన్న సన్నని గీతను ‘కృత్రిమ మేధ’ అనే అదృశ్య రాకాసి పూర్తిగా చెరిపేసింది. ఒక దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల ప్రక్రియ, ఈ అత్యాధునిక సాంకేతికత సృష్టిస్తున్న డీప్‌ఫేక్స్, ఫేక్ న్యూస్ అనే మాయాజాలంలో బందీ అయిపోయి, ఊపిరాడక విలవిలలాడుతోంది. ఇది కేవలం సాంకేతిక లోపం కాదు.. మన ఆలోచనలను, మన స్వేచ్ఛను అదృశ్యంగా హైజాక్ చేస్తున్న ఒక కఠోరమైన సైబర్ ఉగ్రవాదం.
ప్రపంచ జనాభాలో సగం మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఈ సూపర్ ఎలక్షన్ సైకిల్ (2024-2025) లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, మానవ మేధస్సుకు రాబోయే ముప్పు ఏ స్థాయిలో పొంచి ఉందో ఇట్టే అర్థమవుతుంది. అగ్రరాజ్యం అమెరికాలో ఏకంగా జో బైడెన్ గొంతును అత్యంత కృత్రిమంగా సృష్టించి, రోబోకాల్స్ ద్వారా సామాన్య ఓటర్ల హక్కును కాలరాసే ప్రయత్నం చేయడం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా నుంచి మొదలుకుని ఇండోనేషియా, పాకిస్తాన్, స్లోవేకియా దాకా.. ఈ డీప్‌ఫేక్ మహమ్మారి సృష్టించిన విద్వేషపు మంటలు అన్నీ ఇన్నీ కావు. పోలింగ్‌కు సరిగ్గా కొన్ని గంటల ముందు, ఎవరికీ నిజం చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా, నకిలీ ఆడియోలు , వీడియోలతో ప్రత్యర్థుల ప్రతిష్టను మట్టికరిపించే నీచమైన రాజకీయ క్రీడకు కృత్రిమ మేధ ఒక భయంకరమైన ఆయుధంగా మారిపోయింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశం ఈ కల్పిత వార్తలకు, డీప్‌ఫేక్ దాడులకు అతిపెద్ద ప్రయోగశాలగా మారడం మరీ బాధాకరం. తమకు కావలసిన నాయకుడికి ఓటు వేయాలన్న ప్రజల భావోద్వేగాలను సైతం రాజకీయ రాబందులు ఎలా వాడుకుంటున్నాయో అనడానికి తమిళనాడు ఎన్నికలే ప్రత్యక్ష సాక్ష్యం. ఎప్పుడో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిన దిగ్గజ నాయకులను, ఏఐ రూపంలో తిరిగి బతికించి, వారి గొంతుతో ఓట్లు అడగటం ఎంతటి నైతిక పతనం? చనిపోయిన వారి ఆత్మలను సైతం రాజకీయ ప్రయోజనాల కోసం డిజిటల్ రూపంలో వాడుకోవడం ఈ యుగం చేసుకున్న దౌర్భాగ్యం. ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే, ఏఐ దాడుల తీవ్రత పల్లెపల్లెకూ ఎలా పాకిందో గమనించవచ్చు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేసే ఒక నకిలీ పెట్టుబడి పథకాన్ని ప్రమోట్ చేస్తున్నట్లుగా సృష్టించిన వీడియోలు, జాతీయ నాయకులు రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లుగా పుట్టించిన అబద్ధాలు.. నిరక్షరాస్యులైన సామాన్య ఓటర్ల మనసుల్లో ఎంతటి భయాందోళనలను, గందరగోళాన్ని సృష్టించాయో మనం కళ్లారా చూశాం. కళ్ల ముందు కనిపించేదల్లా నిజమే అని నమ్మే ఒక అమాయకపు ఓటరును, ఈ టెక్నాలజీ ఎంత కిరాతకంగా వంచించిందో చెప్పడానికి ఇవే సజీవ సాక్ష్యాలు.
ఇంతటి సాంకేతిక విధ్వంసం జరుగుతున్నా, మనం ఆ అబద్ధాలనే ఎందుకు నిజాలుగా గుడ్డిగా నమ్ముతున్నామన్నది ఇక్కడ అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. దీనికి కారణం మానవ మెదడులోని బలహీనతే. కచ్చితమైన పెదవుల కదలికలతో, సహజమైన ముఖ కవళికలతో ఏఐ సృష్టిస్తున్న వీడియోలు మన మెదడును క్షణాల్లో ఏమార్చుతున్నాయి. అది నకిలీదని అధికారికంగా నిర్ధారణ జరిగినా, ఒకసారి ఆ విషం మనసులోకి ఎక్కిన తర్వాత చెరిపేయడం ఎవరి తరమూ కావడం లేదు. దీనికి తోడు మన సమయాన్ని, మన భావోద్వేగాలను అమ్ముకుని వేల కోట్లు గడిస్తున్న సోషల్ మీడియా దిగ్గజ సంస్థల అల్గారిథమ్స్.. మనలో భయాన్ని, ద్వేషాన్ని రగిల్చే వార్తలకే పెద్దపీట వేస్తున్నాయి. మనకు నచ్చిన, మన భావజాలానికి అద్దం పట్టే అబద్ధాలనే పదే పదే చూపిస్తూ, మన చుట్టూ ఒక ‘డిజిటల్ కారాగారాన్ని’ నిర్మిస్తున్నాయి. అందులో బందీ అయిన సగటు మనిషి, అవతలి వారి వాదనను కనీసం వినలేని, సహించలేని ఒక అంధకార స్థితికి చేరుకోవడం ఆధునిక సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద మానసిక సంక్షోభం.
సాంకేతికత రాకెట్ వేగంతో దూసుకుపోతుంటే, మన ప్రాథమిక చట్టాలు ఇంకా ఎద్దుల బండి శకంలోనే నిలిచిపోవడం ఈ వినాశనానికి ఆజ్యం పోస్తోంది. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు (ఆర్టికల్ 21) పౌరుడి భౌతిక శరీరాన్ని కాపాడుతుందేమో కానీ, అతని ముఖాన్ని, స్వరాన్ని, ‘డిజిటల్ అస్తిత్వాన్ని’ కాపాడటంలో ఘోరంగా విఫలమవుతోంది. కొత్తగా వచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం, ఐటీ రూల్స్ సవరణలు కొంత ఊరటనిస్తున్నా.. రోజురోజుకూ ముంచుకొస్తున్న ఈ సైబర్ సునామీని అడ్డుకోవడానికి అవి ఏమాత్రం సరిపోవు. డీప్‌ఫేక్స్ సృష్టిస్తున్న కంటికి కనిపించని మానసిక, ప్రతిష్టాత్మక నష్టాలను అంచనా వేసే చట్రమే మన న్యాయవ్యవస్థలో కొరవడటం దిగ్భ్రాంతికరం.
ఈ విపత్కర పరిస్థితుల నుంచి మన ప్రాణప్రదమైన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే నిరంతరం సైబర్ దాడులు ఎదుర్కొంటూ కూడా సత్యంగా నిలబడుతున్న తైవాన్ లాంటి దేశాలను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. కేవలం చట్టాలు చేస్తే సరిపోదు, తైవాన్ తరహాలో ఏఐ విద్వేష కంటెంట్‌ను కేవలం 48 గంటల్లో నిర్దాక్షిణ్యంగా తొలగించే కఠిన శిక్షాస్మృతులు అమలులోకి రావాలి. ఈ సైబర్ దాడులను తక్షణమే విచారించే ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ వ్యవస్థలు పుట్టుకురావాలి. యూరోపియన్ యూనియన్ మాదిరిగా, ఏఐతో సృష్టించిన ప్రతి అణువుపైనా ‘డిజిటల్ వాటర్‌మార్కింగ్’ తప్పనిసరి చేయాలి. అద్భుతమైన ఏఐ సృష్టిస్తున్న ఈ విషమ పరిస్థితిని ఎదుర్కోవడానికి మళ్లీ అదే ఏఐను ఆయుధంగా చేసుకుని, ఎక్కడికక్కడ నకిలీని పసిగట్టే సాంకేతికతను ఎన్నికల సంఘం తన బ్రహ్మాస్త్రంగా మలచుకోవాలి.
సాంకేతికత ప్రవాహాన్ని ఎవరూ ఆపలేరు. కానీ, ఆ ప్రవాహంలో సత్యం కొట్టుకుపోకుండా గట్టున నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. “నేను చదువుతున్నది వాస్తవమేనా? నేను చూస్తున్నది నకిలీ సృష్టేమో?” అని ప్రతి పౌరుడూ, ప్రతి ఓటరూ తనను తాను ప్రశ్నించుకోగలిగిన నాడు మాత్రమే ఈ మాయాజాలం బద్దలవుతుంది. కఠినమైన చట్టాలు, బాధ్యతాయుతమైన సాంకేతిక సంస్థలు, చైతన్యవంతమైన పౌర సమాజం.. ఈ మూడు ఏకతాటిపైకి వచ్చినప్పుడే ఈ డిజిటల్ కల్పనల కౌగిలి నుంచి నిఖార్సైన నిజం బటయపడుతుంది. లేనిపక్షంలో… రేపటి మన పిల్లలకు ‘సత్యం’ అంటే ఏమిటో చరిత్ర పుస్తకాల్లో వెతుక్కోవాల్సిన దుస్థితి దాపురిస్తుంది. వాస్తవం బతికితేనే ప్రజాస్వామ్యం శ్వాసిస్తుంది. ఆ వాస్తవాన్ని బతికించుకునే బృహత్తర బాధ్యతను భుజాన వేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది!
**గడల నరసింహారావు,సీనియర్ జర్నలిస్ట్,ఖమ్మం**







