Mahaa Daily Exclusive

  ఇడుపు కాయితం’ అర్థం పవన్ కళ్యాణ్‌ను అడగండి.

Share

  •  తెలంగాణ భాషపై ట్రోలింగ్‌కు కవిత స్ట్రాంగ్ కౌంటర్.
  •  బీఆర్ఎస్‌లో ఉన్నది గుంటనక్కే.. కార్పొరేట్ శక్తులకు పాలుపోసి పెంచుతోంది ఆయనే.
  • జులై 2న ఉప్పల్ భగాయత్‌లో మహా భూపోరాటం.
  •  కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌లపై తెలంగాణ రక్షణ సేన సమరశంఖం.
  • లాఠీలు, రబ్బరు తూటాలు నన్ను దాటుకుని రావాలి.
  •  ఉప్పల్ గడ్డపై కల్వకుంట్ల కవిత గర్జన.

    హైదరాబాద్,మహా.

తెలంగాణ అస్తిత్వంపై దాడులు జరుగుతుంటే రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు గప్‌చుప్ అయ్యాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆనాడు తెలంగాణను అడ్డుకున్న అనకొండలు, కార్పొరేట్ శక్తులకు బీఆర్ఎస్‌లో ఉన్న ఒక గుంటనక్కే పాలు పోసి పెంచుతోందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఉప్పల్‌లో పార్టీ జెండా ఆవిష్కరణ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ‘ఇడుపు కాయితం’ అనే పదానికి అర్థం పవన్ కళ్యాణ్‌ను అడిగితే బాగా చెబుతాడంటూ తెలంగాణ భాషను అవహేళన చేసేవారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల సాధన కోసం జులై 2న ఉప్పల్ భగాయత్‌లో మహా భూపోరాటం చేయనున్నట్లు ప్రకటించిన కవిత.. తెలంగాణ కోసం ఇకపై పోరాడేది ఒక్క టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) మాత్రమేనని స్పష్టం చేశారు.
ఉప్పల్ ఉద్యమానికి అడ్డా.. ఇక్కడే మా తొలి అడుగు
ఉప్పల్ ప్రాంతం అంటేనే తెలంగాణ ఉద్యమానికి అడ్డా అని, అలాంటి చారిత్రక ప్రాంతంలో తమ పార్టీ జెండా ఎగురవేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎంతో పోరాడి తెలంగాణ సాధించుకున్నప్పటికీ, ఉద్యమ సమయంలో మనం కన్న కలలను, అనుకున్న లక్ష్యాలను రాష్ట్రం వచ్చాక కూడా సాధించుకోలేకపోయామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రజల పక్షాన నిలబడేందుకు మరోసారి ఉద్యమకారులందరినీ ఏకం చేస్తున్నామని తెలిపారు.
జులై 2న ఉప్పల్ భగాయత్‌లో మహా భూపోరాటం
ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్న 250 గజాల భూమి హామీ కోసం ప్రత్యక్ష పోరాటానికి దిగుతున్నట్లు కవిత ప్రకటించారు. ఇందులో భాగంగా జులై 2వ తేదీన ఉప్పల్ భగాయత్‌లో పెద్ద ఎత్తున భూపోరాటం చేయబోతున్నామని స్పష్టం చేశారు. ఈ పోరాటానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులంతా పెద్ద ఎత్తున తరలిరావాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులు, మహిళలు, విద్యార్థుల హక్కుల సాధన కోసం తెలంగాణ రక్షణ సేన నిరంతరం పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు.
‘ఇడుపు కాగితం’ అర్థం పవన్ కళ్యాణ్‌కు బాగా తెలుసు
తెలంగాణ భాషను అవహేళన చేసే వారిపై కవిత తీవ్రంగా మండిపడ్డారు. ‘ఇడుపు కాగితం’ అనే పేరును ఒక సినిమాకు పెడితే, అది అర్థం కాలేదంటూ కొందరు ట్రోలింగ్ చేస్తున్నారని విమర్శించారు. ఇడుపు కాగితం అంటే అర్థం ఏమిటో మీ పవన్ కళ్యాణ్‌ను అడిగితే బాగా చెబుతాడని ఆమె ఘాటుగా బదులిచ్చారు. ఒకరి భాషను మరొకరు గౌరవించుకుందామని, కానీ తెలంగాణ భాషను అవమానిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. నాడు ఇలాగే మన భాషను, సంస్కృతిని అవహేళన చేస్తేనే పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని గుర్తుచేశారు.
ఆ మూడు పార్టీలు గప్‌చుప్.. సీఎంకు ఉద్యమంతో సంబంధమే లేదు
తెలంగాణ అస్తిత్వంపై, భాషపై దాడి జరుగుతుంటే ప్రధాన పార్టీలన్నీ మౌనం వహిస్తున్నాయని కవిత విమర్శించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రికి అసలు తెలంగాణ ఉద్యమంతోనే సంబంధం లేదని, అందుకే ఆయన ఏమీ మాట్లాడటం లేదన్నారు. ఇక బీజేపీకి ‘దేశం’ జపం తప్ప మన రాష్ట్రం పట్ల ఎలాంటి పట్టింపు లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడటం మానేసిందని, ఆ పార్టీకి తెలంగాణతో పేగు బంధం పూర్తిగా తెగిపోయిందని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్‌లో ఉన్న ఆ గుంటనక్కే కార్పొరేట్లకు పాలుపోస్తోంది
బీఆర్ఎస్ మౌనం వెనుక ఉన్న వ్యాపార కోణాన్ని కవిత ఎండగట్టారు. ఆ పార్టీలో ఉండే ఒక గుంటనక్క… నారాయణ, చైతన్య విద్యాసంస్థలతో పాల వ్యాపారం చేస్తున్నాడని ఆరోపించారు. ఆంధ్రా వాళ్లతో వ్యాపారాలు చేస్తున్నందుకే బీఆర్ఎస్ నేతలు కనీసం నోరు మెదపడం లేదన్నారు. నాడు తెలంగాణను అడ్డుకునేందుకు ఏ అనకొండలు, ఏ కార్పొరేట్ శక్తులు ప్రయత్నించాయో.. నేడు ఆ శక్తులకే బీఆర్ఎస్‌లోని ఆ గుంటనక్క పాలు పోసి పెంచుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
దోచుకుంటున్న కార్పొరేట్ స్కూళ్లు.. ఫీజులు తగ్గించని సీఎం
కార్పొరేట్ స్కూళ్లు, ఆసుపత్రుల దోపిడీపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో రోజుల నుంచి కార్పొరేట్ స్కూళ్ల ఫీజులు తగ్గించాలని డిమాండ్ వస్తున్నా ఈ ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదన్నారు. నారాయణ, చైతన్య సహా పెద్ద కార్పొరేట్ స్కూళ్లు, హాస్పిటల్స్‌లో స్థానిక సంస్థలైన మదర్ డెయిరీ, ముల్కానూరు, విజయ డెయిరీల నుంచే పాలు కొనుగోలు చేసేలా ప్రభుత్వం తక్షణమే జీవో తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు.
ఉద్యోగాలన్నీ పరాయి వాళ్లకేనా? కనీసం బాత్రూమ్‌లు కడిగే పని కూడా ఇవ్వరా?
కార్పొరేట్ సంస్థల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడంపై కవిత మండిపడ్డారు. ఆయా స్కూళ్లలో కటింగ్, బట్టలు ఉతకటం, ఫర్నీచర్ వంటి చిన్న పనులకు కూడా మన వాళ్లకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. టీచర్లను సైతం 80 శాతం కేరళ, ఆంధ్రా నుంచే తీసుకొస్తున్నారని, ఇప్పుడు నార్త్ ఇండియా నుంచి వస్తున్న స్కూళ్లలో బాత్రూమ్‌లు కడిగేందుకు కూడా అక్కడి వాళ్లనే తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో మన హక్కుల కోసం కేవలం తమ టీఆర్ఎస్ మాత్రమే మాట్లాడుతోందని స్పష్టం చేశారు.
అవాకులు, చెవాకులు పేలిన వాళ్లే మళ్లీ కుట్రలు చేస్తున్నారు
ఉద్యమ కాలంలో తెలంగాణను వ్యతిరేకిస్తూ అవాకులు, చెవాకులు పేలిన నాయకులు, శక్తులంతా ఇప్పుడు మళ్లీ పేట్రేగిపోతున్నారని, తెలంగాణపై కుట్రలు చేస్తున్నారని కవిత హెచ్చరించారు. అలాంటి శక్తుల ఆటలు సాగనివ్వబోమని, తెలంగాణ ప్రజల కోసం, ఉద్యమకారుల కోసం తాను ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
లాఠీలు, రబ్బరు తూటాలు నన్ను దాటుకునే రావాలి
ప్రజల పక్షాన నిలబడే పోరాటంలో తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కవిత తేల్చిచెప్పారు. లాఠీలు దెబ్బలైనా, రబ్బరు తూటాలైనా ముందుగా నన్ను దాటుకొనే మీ వద్దకు రావాలి అని కార్యకర్తలకు ధైర్యం నూరిపోశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక కచ్చితంగా రాష్ట్రంలో ఉచిత విద్య, వైద్యం అందిస్తుందని ఆమె హామీ ఇచ్చారు.
ఉప్పల్ ఎమ్మెల్యే సీటు మాదే.. ప్రజాసేవ అంటే చూపిస్తాం
భవిష్యత్ రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తూ.. రాబోయే రోజుల్లో ఉప్పల్‌లోని అన్ని డివిజన్లలో తమ పార్టీ పోటీ చేస్తుందని కవిత వెల్లడించారు. భవిష్యత్తులో ఉప్పల్ ఎమ్మెల్యే సీటును కూడా కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒక రాజకీయ పార్టీ అంటే ఎలా సేవ చేయాలి, ప్రజల కోసం ఎలా పనిచేయాలో తాము చేసి చూపిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీల సాధన కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు.